
ప్రపంచంలో ఎన్నో ఆలోచనలు ఉన్నాయి అయితే వాటిని అమలుచేసే దైర్యం తెలివితేటలు చాల కొద్దిమందికి మాత్రమే ఉంటాయి. ధైర్యాన్ని తెలివితేటలను సమతూకంలో బ్యాలెన్స్ చేసుకున్నవారు మాత్రమే వ్యాపార రంగంలో రాణించగలుగుతారు. ఈమధ్య ఒక ప్రముఖ వాణిజ్య బ్యాంక్ నిర్వహించిన లోన్ మేళా కు వచ్చిన ఇంజనీరింగ్ చదివిన ఒక ఆటో డ్రైవర్ కొడుకు ఇచ్చిన సమాధానానికి ఆ బ్యాంకింగ్ అధికారులు ఆశ్చర్య పడినట్లు వార్తలు వచ్చాయి.
అనుభవం లేకుండా ఆస్థులు లేకుండా పరిశ్రమ ఎలా పెడతావు అని ఆ బ్యాంక్ అధికారి ఆ యువకుదుని అడిగినప్పుడు అనుభవం లేకపోయినా అనుభవం తెచ్చుకుంటాను అష్టపోయే పరిస్థితి తనకు రాదు అని ధృఢసంకల్పంతో ఆ యువకుడు చెప్పిన సమాధానం అతడికి బ్యాంక్ లోను వచ్చేలా చేసిందని ఒక ప్రముఖ దినపత్రిక తన ఆసక్తికర కథనంలో పేర్కొంది.
ఇప్పుడు తెలుగు రాష్ట్రాలలో కరోనా పరిస్థితులు తరువాత చాలామంది ఇంజనీరింగ్ ఉన్నత విద్యలు చదువుకున్న మధ్య తరగతి ఎగువ మధ్యతరగతికి చెందిన యువతరం ప్రతినిధులు ధైర్యంగా ముందడుగు వేస్తూ అనేక చిన్న తరహా మధ్య తరహా పరిశ్రమలను స్థాపించే ఏర్పాట్లల్లో బిజీగా ఉంటున్నారని ఆ పత్రిక తన కథనంలో పేర్కొంది. అంతేకాదు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం పరిశ్రమలు స్థాపిస్తున్న వారిలో 60 శాతం మందికి పైగా యువతరం ప్రతినిదులే ఉంటున్నారని ఆ కథనం అభిప్రాయ పడుతోంది.
వ్యాపారం అంటే నష్టాలు కష్టాలు ఋణాలు దివాళా జప్తు మూసివేతలు ఇలా ఎన్నో సమస్యలు ఉంటాయి. ఈ సమస్యల గురించి ఆలోచించకుండా మన తెలుగు రాష్ట్రాలలో వేల సంఖ్యలో స్టార్టప్ కంపెనీలు పుట్టుకు వస్తున్నాయి. ఇది మంచి పరిణామమే అయినప్పటికీ వీరందరికీ సక్రమ మార్గంలో దిశానిర్దేశం చేసే వ్యవస్థలు అధికారులు ప్రభుత్వాలలో లేని పరిస్థితులలో ఈ అత్యుత్సాహం వికటిస్తే అనేక పరిణామాలు వచ్చే ఆస్కారం ఉంది అంటూ మనీ ఎక్స్ పర్ట్స్ హెచ్చరికలు చేస్తున్నారు..