ఈ చరాచర జగత్తు మొత్తం ఏదో ఒక శక్తి ఆజ్ఞానుసారం నడుస్తోందని ఆధ్యాత్మిక తత్వవేత్తలు చెపుతారు. ఆ శక్తికి రూపురేఖలు లేకపోయినా ఒక బలమైన మూల కారణం ఉంది అని అంటారు. అదే ‘ఓంకార నాదం’ ఆ ఓంకారం లోనే శివ తత్వం ఇమిడి ఉంది. అందుకే సర్వం శివమయం అని అంటారు. 

శివుడు పేరు వినగానే మనకు గుర్తుకు వచ్చేది ‘శివరాత్రి’ ప్రతినెల కృష్ణచతుర్దశి రోజున ‘శివరాత్రి’ వస్తూనే ఉంటుంది. దీనిని ‘మాసశివరాత్రి’ అంటారు. ఆ రోజున ఈశ్వరుని ఆలయాల్లో విశేష పూజలు చేస్తూ ఉంటారు. అయితే మాఘ బహుళ చతుర్దశి నాడు వచ్చే ‘మహాశివరాత్రి’ పర్వదినం పరమ పవిత్రమైనది. ‘శివరాత్రి’ రోజు పగలంతా నియమ నిష్ఠలతో ఉపవాసంతో గడిపి రాత్రి నాలుగు జాముల్లోనూ శివలింగాన్ని మొదట పాలతో, తర్వాత పెరుగుతో, ఆ తర్వాత నేతితో, ఆ తర్వాత తేనెతో అభిషేకిస్తే శివునికి ప్రీతి కలుగుతుందని మన నమ్మకం. దీనిని మించిన వ్రతం మరొకటి లేదంటారు. 

‘శివరాత్రి’ అంటే ప్రత్యేక అర్థము ఉన్నది అన్న విషయం చాల మందికి తెలియదు. ‘రా’ అన్నది దానార్థక ధాతు నుండి ‘రాత్రి’ అయిందంటారు. సుఖాన్ని ప్రదానం చేసేదాన్నే రాత్రి అంటారు. ఋగ్వేద  రాత్రి సూక్తం తాలూకు యూప మంత్రంలో రాత్రిని ప్రశంసిస్తూ యిలా చెప్పబడింది ‘హే రాత్రే’ అక్లిష్టమైన తమస్సు మా దగ్గరికి రాకుండుగాక అంటూ ధ్యానం చేస్తారు.  ‘శివరాత్రి’ నాడు చేసే పూజలో శివఅష్టోత్తరము, శివపంచాక్షరీ మంత్రములను స్తుతిస్తే అష్టైశ్వర్యాలు, మోక్షమార్గాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు. 

శివుడు ఈ రోజే లింగాకారంగా ఆవిర్భవించాడని శివపురాణంలో ఉంది. భస్మము విభూతి తయారుచేయటానికి ఈనాడు పవిత్రమైన రోజుగా భావిస్తారు. రోజు అంతా భక్తులు “ఓం నమః శివాయ” అంటూ శివ నామం జపిస్తూ కాలం గడుపుతారు. శివలింగం బిందు నాదాత్మకమని శివపురాణం చెపుతోంది. ఈరోజు శివలింగాన్ని పూజిస్తే శక్తిని కూడ ఆరాధించినట్లే అని మన పురాణాలు చెపుతున్నాయి. విభూతి అంటే ‘ఐశ్వర్యం’ ఈ విశ్వం అంతా ఐశ్వర్యమయం కావాలని ఈరోజు శివుడును ప్రార్ధిస్తే మన కోరికలు అన్నీ ఆయనే తీరుస్తాడని శివ పురాణం చెపుతోంది. ఈరోజు శివలింగాన్ని పూజిస్తే సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలు కలుగుతాయి కాబట్టి మన భారత దేశంలోని అన్ని శైవ క్షేత్రాలు శంభో శంకర హర హర మహాదేవా అనే నాదంతో మారుమ్రోగి పోతాయి..



మరింత సమాచారం తెలుసుకోండి: