వచ్చేనెల విడుదలకాబోతున్న ‘బాహుబలి 2’ లో కట్టప్ప బహుబలిని ఎందుకుచంపాడు అన్న సస్పెన్స్ కు రాజమౌళి క్లారిటీఇస్తాడు అని అందరు ఎదురు చూస్తూ ఉంటె ఇప్పడు ఏకంగా కట్టప్ప ‘బాహుబలి 2’ విడుదలకు సమస్యగా మారడం హాట్ టాపిక్ గా మారింది. దేశంలోని అన్ని ప్రాంతాలలోని ప్రజలు ‘బాహుబలి 2’ విడుదల గురించి చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటె దీనికి భిన్నంగా ‘బాహుబలి2’ విడుదల విషయంలో కన్నడిగుల్లో ప్రత్యేకమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది.
ఈ వ్యతిరేకత కూడ ఈ సినిమాలో కట్టప్ప పాత్ర పోషించిన సత్యారాజ్ కారణంగానేరావడం మరింత ఆశ్చర్యకరంగా మారింది. ‘బాహుబలి 2’ సినిమా విడుదలను తాము అడ్డుకుంటామంటూ గళం విప్పారు కన్నడ ప్రజా సంఘాలు. ఆసక్తికరమైన ఈన్యూస్ వివరాలలోకి వెళ్ళితే ఈ సినిమాలో కట్టప్ప పాత్ర పోషించిన సత్యరాజ్ గతంలో కావేరీ జలాల విడుదల సమయంలో చేసిన వ్యాఖ్యల్ని తెరమీదకు తీసుకొచ్చిన కన్నడ సంఘాలు సత్యరాజ్ సారీ చెబితేనే కానీ ‘బాహుబలి 2’ సినిమా విడుదలకు అంగీకరించమని చెపుతున్నారు.
అంతేకాదు కట్టప్పను ‘ఓ కెట్టప్ప’ [చెడ్డవాడు కన్నడంలో అర్థం] అంటూ మీడియా ముందుకు వచ్చి హడావిడి చేస్తున్నాయి కన్నడ సంఘాలు.
కావేరీ జలాల విడుదల సమయంలో కన్నడిగుల్ని అవహేళన చేసేలా సత్యరాజ్ వ్యాఖ్యలు చేశారని ఆయన భేషరతుగా క్షమాపణలు చెబితే తప్ప ఊరుకునేది లేదని అంటున్నారు కన్నడ సంఘాలు. ఈ మధ్య తమిళనాడులో చోటు చేసుకున్న తీవ్ర నీటి ఎద్దడి నేపథ్యంలో కావేరీ జలాల్ని విడుదల చేయాలని తమిళనాడు కోరటం, అందుకు కన్నడిగులుససేమిరా అనటం తెలిసిన విషయమే.
ఈ ఉదంతంలో రెండు రాష్ట్రాల్లో కలకలం చెలరేగటమే కాకుండా ప్రశాంతంగా ఉండే కర్ణాటక ఒక్కసారి భగ్గుమంది. ఈ సందర్భంగా కావేరీ నీటిని విడుదల చేయాలంటూ డిమాండ్ చేసిన వారిలో తమిళనటుడు సత్యరాజ్ కూడా ఉన్నాడు. దీనితో కావేరీ జలాల విషయంలో కన్నడిగుల్ని అవహేళన చేసేలా సత్యరాజ్ మాట్లాడారని ఆయన సారీ చెబితేనే ‘బాహుబలి 2’ విడుదల గురించి ఆలోచిస్తామంటున్నాయి కన్నడ సంఘాలు.
అయితే సత్యరాజ్ నోటి నుంచి సారీ అన్న మాట వస్తే తాము సహించం అంటున్నాయి తమిళ సంఘాలు. దీనితో ఈ రెండు రాష్ట్ర ల ప్రజల కోపాల మధ్య కేవలం సత్యరాజ్ మాత్రమే కాకుండా ‘బాహుబలి 2’ కూడ చిక్కుకోవడంతో ఈసినిమా అత్యంత భారీ కలక్షన్స్ పై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాజమౌళికి కట్టప్ప సమస్యగా మారాడు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..