టాప్ హీరోల వారసులలో నాగచైతన్య ప్రయాణం చాల ప్రత్యేకమైంది. అనేక పరాజయాల తరువాత ప్రస్తుతం తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను ఏర్పరుచుకుని తనలోని మాస్ క్లాస్ అంశాలను మిళితం చేస్తూ విభిన్నమైన సినిమాలను చేస్తున్నాడు చైతు.
ఈ వారం విడుదల కాబోతున్న ‘రా రండోయ్ వేడుక చూద్దాం’ సినిమాను ప్రమోట్ చేస్తూ తన సినిమాల గురించి ముఖ్యంగా సమంతను గురించి అనేక ఆ సక్తికర విషయాలను షేర్ చేసాడు చైతు. ఇదే సందర్భంలో తన తల్లి సమంతా పట్ల ఇష్టపడటానికి మొదట్లో తాను మధ్య వర్తిలా పడ్డ కష్టాలను వివరించాడు.
అయితే సమంత తన తల్లి వేవ్ లెంగ్త్ తగ్గట్టుగా చాల తెలివిగా ప్రవర్తించిన సందర్భాలను వివరిస్తూ ప్రస్తుతం వారిద్దరూ బాగా కలిసిపోయారు అంటూ సమంత తెలివితేటలను తెగమెచ్చుకున్నాడు. చెన్నైలోని తన తల్లి దగ్గరకు సమంత వెళ్ళినప్పుడు లంచ్ కానీ డిన్నర్ కాని చేయకుండా రాదు అని చెపుతూ ప్రస్తుతం తనకంటే తన తల్లితో సమంత మాత్రమే బాగా క్లోజ్ అని జోక్ చేసాడు.
ఇదే సందర్భంలో రాబోతున్న అక్టోబర్ లో తన పెళ్లి జరగబోతున్న విషయాన్ని చెపుతూ తన తల్లి తనను రెండు మూడు గంటలు జరిగే పెళ్ళిలోని ప్రతి తంతుకు సబంధించిన పెళ్ళి మంత్రాలకు సంబంధించి అర్ధాలు తెలుసుకోమంది అన్న ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు. అంతేకాదు ఇలా పెళ్ళి మంత్రాలకు అర్ధం తెలుసుకోవడం కోసం తాను ప్రత్యేకంగా పెళ్ళి చేసే బ్రాహ్మణుడును అడిగి అర్ధాలు తెలుసుకుంటున్న విషయాన్ని తెలియ చేసాడు.
గత ఏడు సంవత్సరాలుగా సమంతను ప్రేమిస్తున్న తనకు సమంత కు సంబంధించిన ప్రతి విషయం తెలుసు అని ఏడేళ్ళుగా తాము ఒకరినొకరు పూర్తిగా అర్ధం చేసుకున్న తరువాత మాత్రమే తాము పెళ్ళికి రెడీ అవుతున్న విషయాన్ని బయట పెట్టాడు నాగచైతన్య. ఇక చివరిగా తన తండ్రి నాగార్జున గురించి మాట్లాడుతూ తాను నటించే సినిమాల స్క్రిప్ట్ ఎంపిక నుండి ప్రతి విషయంలోనూ సలహాలు ఇస్తూ తనకు ఒక స్నేహితుడు కంటే ఎక్కువగా నాన్న నాకు మారిపోయాడు అంటూ తన తండ్రి పై ప్రశంసలు కురిపించాడు నాగచైతన్య..