అభిమానులే మాకు దేవుళ్ళు అంటూ టాప్ హీరోలు తమ సినిమాల ప్రమోషన్ ఫంక్షన్స్ లో మాట్లాడటం అనేక సార్లు కనిపించే సంఘటన. దీనితో హీరోల వీరాభిమానులు మరింత రెచ్చిపోయి తమ హీరో అభిమాన సంఘాలను ప్రతి ఊరులోను ఏర్పాటు చేస్తూ హడావిడి చేయడం ఎప్పటి నుంచో కొనసాగుతున్న సాంప్రదాయం. అయితే ఈ కల్చర్ కు ఫుల్ స్టాఫ్ పెడుతూ యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటూ వార్తల హడావిడి జరుగుతోంది. 

‘అర్జున్ రెడ్డి’ సూపర్ సక్సస్ తో విజయ్ దేవరకొండకు వచ్చే ఆఫర్స్ పెరగడమే కాకుండా ఈ యంగ్ హీరోను అభిమానించే అభిమానుల సమాఖ్య కూడ బాగా పెరిగిపోతోంది. ఈ అభిమానంతో విజయ్ దేవరకొండ అభిమాన సంఘాలు మన ఇరు రాష్ట్రాలలో ఇప్పటికే రిజిష్టర్ అయినట్లు తెలుస్తోంది. 

ఈమధ్య ఈఅభిమాన సంఘాలకు చెందిన కొందరు నాయకులు విజయ్ దేవరకొండను వ్యక్తిగతంగా కలిసి ఈ అభిమాన సంఘాల విషయాలను తెలియచేసి విజయ్ తమతో ఫోటో తీయించుకుంటే ఆఫోటోలను అభిమాన సంఘాల ఫ్లక్సీలలో వేయించి రాబోయే విజయ్ సినిమాల మొదటిరోజున హడావిడి చేస్తామని చెప్పినట్లు టాక్. దీనితో షాక్ అయిన అర్జున్ రెడ్డి తన అభిమానులకు సున్నితంగా క్లాస్ పీకినట్లు వార్తలు వస్తున్నాయి. తన పేరుతో అభిమాన సంఘాలు ఏర్పాటు చేయడం తనకు ఇష్టం లేదని అందువల్ల అటువంటి ప్రయత్నాలు మానుకోమని విజయ్ దేవరకొండ తన అభిమానులకు సూచించినట్లు తెలుస్తోంది. 

తన పేరున అభిమాన సంఘాలు పెట్టే బదులు ఆ సభ్యులు తమ కెరియర్ విషయంలో శ్రద్ద తీసుకుని జీవితంలో బాగా సక్సస్ అయితే తాను చాల ఆనంద పడతానని చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో ఎంతో ఉత్సాహంగా వచ్చిన విజయ్ దేవరకొండ అభిమానుల పై అర్జున్ రెడ్డి నీళ్ళు చల్లినట్లు అయిందని అతడి అభిమానులు బాధ పడుతున్నట్లు టాక్. డిఫరెంట్ సినిమాలు చేయడమే కాకుండా నిజజీవితంలో కూడ విజయ్ దేవరకొండ విలక్షణంగా ప్రవర్తిస్తున్నాడనే అనుకోవాలి..    


మరింత సమాచారం తెలుసుకోండి: