పవన్ కళ్యాణ్ కు ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీస్ రెండు ఆప్క్షన్స్ ఇచ్చింది అన్నవార్తలు ప్రస్తుతం ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారింది. ‘అజ్ఞాతవాసి’ ఫెయిల్యూర్ తరువాత ఆషాక్ నుండి వెంటనే తేరుకుని పవన్ తన రాజకీయయాత్రలను ప్రారంభిస్తూ ఇక తాను సినిమాలలో నటించను అని స్పష్టంగా చెప్పిన విషయం తెలిసిందే. దీనితో షాక్ కు గురైన మైత్రీ మూవీస్ సంస్థ పవన్ కళ్యాణ్ కు ఈవిషయమై రెండుమార్గాలను సూచించినట్లు వార్తలు వస్తున్నాయి.
పవన్ చాలకాలం క్రితమే మైత్రి మూవీస్ సంస్థ దగ్గర 12కోట్లు అడ్వాన్స్ గా తీసుకున్నట్లు టాక్. పవన్ తో చేయబోయే ఈసినిమా కోసం మైత్రి మూవీస్ ఒక తమిళ సినిమా రైట్స్ కొని దర్శకుడు సంతోష్ శ్రీనివాస్ చేత స్క్రిప్ట్ కూడ తయారుచేయించి ఈస్క్రిప్ట్ విషయమై ఇప్పటికే పవన్ అంగీకారం కూడ తీసుకున్నట్లు వార్తలు ఉన్నాయి.
ఈస్క్రిప్ట్ రచన కోసం ఒక ప్రత్యేకమైన ఆఫీసుతో పాటు ఒక రైటర్స్ టీమ్ ను కూడ భారీ ఖర్చుతో మెయిన్ టైన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇప్పుడు పవన్ తీసుకున్న ఈనిర్ణయంతో మైత్రీ మూవీస్ కు సుమారు 20 కోట్లవరకు నష్టం కలిగింది అని ఆసంస్థ భావిస్తోందట. దీనితో తమకు ఆ భారీ మొత్తాన్ని తిరిగి ఇవ్వడం కానీ లేదంటే పవన్ కళ్యాణ్ కు సంబంధించిన 50 రోజుల డేట్స్ ఇవ్వడం కానీ ఎదో ఒకవిషయం తేల్చి చెప్పమని గట్టిగా అడుగుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఈఊహించని పరిణామానికి షాక్ అయిన పవన్ తన భవిష్యత్ కార్యాచరణ కోసం ఆలోచనలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈసంవత్సరం చివరకు ఎన్నికలు వస్తాయి అన్న వార్తలు హడావిడి చేస్తున్న నేపధ్యంలో ప్రస్తుతానికి పవన్ మరొక సినిమా చేసే ఉద్దేశ్యంలో లేదు కాబట్టి మైత్రి మూవీస్ సంస్థకు తాను తీసుకున్న భారీ అడ్వాన్స్ ను తిరిగి ఇచ్చే ఆలోచనలలో పవన్ ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..