భారతదేశం గర్వించ దగ్గ గొప్ప నటీమణుల్లో శ్రీదేవి ఒకరు. చిన్నవయసులోనే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి పద్నాలవ ఏట హీరోయిన్ మారారు. అలనాటి మహానటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్ లతో నటించిన శ్రీదేవి తర్వాత వచ్చిన కృష్ణ, శోభన్ బాబు లతో నటించారు..ఆ తర్వాత మూడో తరానికి చెందిన చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లతో కూడా నటించింది శ్రీదేవి. ఏ తరం హీరోలతో నటించినా...ఆమె గ్లామర్ ఒకేవిధంగా ఉండటం గొప్ప విశేషం. లెజండరీ నటి, అతిలోక సుందరి శ్రీదేవి (54) హఠాన్మరణంతో ఆమె గురించి ఆమెకు తెలియని కొన్ని విషయాలు కూడా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
![Related image](https://3.bp.blogspot.com/_hkhUD0LDPho/TFr1UalZJCI/AAAAAAAABeI/Pv3Ov-a8U2k/s1600/vetagadu1.jpg)
ఆమె మరణవార్తను విన్న అభిమానులు, సినీ ప్రముఖులు షాక్‌కు గురవుతున్నారు. ఇదిలా ఉండగా శ్రీదేవి మృతిపై దర్శకేంద్రుడు కే. రాఘవేంద్రరావు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఆమె మృతి సినీరంగానికి తీరనిలోటన్నారు. అలాగే సినీరంగంలో శ్రీదేవి స్వయంకృషితో ఎదిగారని రాఘవేంద్రరావు పేర్కొన్నారు. అప్పట్లో ‘బడిపంతులు’ చిత్రంలో మహానటుడు ఎన్టీఆర్‌కు మనవరాలిగా నటించిన శ్రీదేవి, తిరిగి ఎన్టీఆర్ సరసన హీరోయిన్‌గా నటించిన విషయం అందరికీ తెలిసిందే. శ్రీదేవి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు దర్శకుడు రాఘవేంద్రరావు.
వేటగాడు సినిమా తీసే సమయంలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి అనగానే పెద్ద గొడవ జరిగింది. నిర్మాతలు అస్సలు ఒప్పుకోలేదు. ‘బడిపంతులు’ చిత్రంలో మీ మనవరాలిగా చేసిన పాపే మీ హీరోయిన్ అంటే ఆయన ఒప్పుకుంటారా? అసలు ఈ విషయం ఎన్టీఆర్‌గారికి చెప్పే ధైర్యం ఎవరికి ఉంది? అని నిర్మాతలు ఒకటే గొడవ. ఆ సమయంలో నేను కాస్త ధైర్యం చేసి నేరుగా ఈ విషయం ఎన్టీఆర్ వద్ద ప్రస్తావించడానికి వెళ్లాను. ‘మీతో చేయబోయే హీరోయిన్ గురించి మాట్లాడాలని వచ్చాను సార్’ అని చెప్పా.
అందుకు ఆయన.. ‘ఎవరనుకుంటున్నారు బ్రదర్..’ అంటే ‘శ్రీదేవి.. బడిపంతులు చిత్రంలో మీకు మనవరాలిగా చేసింది. ఇప్పుడు ఆ అమ్మాయికి 14 సంవత్సరాలు’ అన్నారు. వెంటనే ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అవుతారో అని కాస్త టెన్షన్ పడుతున్న సమయంలో ఆయన మాకూ 14 ఏళ్లేగా బ్రదర్’ అని నవ్వారు. దాంతో నాకు ఎక్కడ లేని ధైర్యం వచ్చిందని..‘ఆకుచాటు పిందె తడిసే..’ అనే పాటను ముందు షూట్ చేయగా పాట అద్భుతంగా వచ్చిందని అన్నారు.