అటు నందమూరి, ఇటు అక్కినేని తెలుగు కళామతల్లి ఎంత పుణ్యం చేసుకుందో కానీ రెండు కళ్ళలా ఇద్దరు మహా నటులు కళ కోసమే పుట్టారు. కళే ప్రాణంగా జీవించారు. ఎన్నెన్నో మరపురాని పాత్రలకు ప్రాణ ప్రతిష్ట చేశారు. తాము దివికేగినా తమ నట విన్యాసాన్ని మాత్రం అభిమాన జనానికి ఇచ్చేసి వారి గుండెల్లో సదా గూడు కట్టుకున్నారు.
నందమూరి, అక్కినేనిది సోదర బంధం. వారు సినిమాల్లో మాత్రమే పోటా పోటీగా ఉండేవారు. నిజ జీవితంలో మాత్రం అన్నదమ్ములే. రీల్ కాని సీన్ రియల్ సీన్ అలాంటిది ఒకదాన్ని అన్న నందమూరి బయోపిక్ లో నుంచి ఈ రోజు విడుదల చేశారు. ఈ రోజు నట సామ్రాట్ అక్కినేని పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఉదయం అక్కినేనిగా సుమంత్ పిక్చర్ ని రిలీజ్ చేసిన మేకర్స్ సాయంత్రం ఈ సరదా పిక్ ని అలా వదిలారు.
అందులో అన్న నందమూరికి సిగరెట్ వెలిగిస్తున్న అక్కినేని కనిపిస్తారు. చిత్రమేమిటంటే అక్కినేని వారి నోట్లో కూడా మరో సిగరెట్ ఉంది. ఇలా సరదా సరదాగా సిగరెట్లను ఊదేస్తూ మధురమైన ఎన్నో ఊసులను చెప్పుకుంటున్న ఇద్దరు స్నేహితులను, వెండి తెర వేలుపులను ఈ స్టిల్ ద్వారా తెలుగు జనాలకు చూపించారు ‘యన్‌టీఆర్’ బయోపిక్ యూనిట్.
అచ్చం ఏయన్నార్ లా సుమంత్ అతికినట్లుగా సరిపోతే అన్న గారి లా ఆయన కుమారుడు బాలక్రిష్ణ ఒదిగిపోయాడు. అతిరధ మహారధులెందరో నటిస్తున్న ఈ మూవీలో నుంచి ఒక్కో పిక్ ని విడుదల చేస్తూంటే ప్రేక్షకులలో ఆసక్తి అలా పెరిగిపోతోంది. మరి అద్భుతాలను కళ్ళ ముందు చూపించే క్రిష్ ఈ మూవీకి డైరెక్టర్. దాంతో హైప్ సూపర్ గా క్రియేట్ అవుతోంది. ఓ రేంజిలో ఉత్కంఠను పెంచుతున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలై తెలుగు జాతిని ఓ ఊపు ఊపెస్తుందనడంలో నో డౌట్.