
తెలంగాణా ఎన్నికలకు కౌంట్ దౌన్ మొదలుకావడంతో రాబోతున్న ఎన్నికలలో తెలుగుఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఎవరు పోటీ చేస్తారు అన్న ఆసక్తికర చర్చలు అప్పుడే మొదలైపోయాయి. ఇలాంటి పరిస్థుతులలో జూబ్లీ హిల్స్ అసెంబ్లీ స్థానానికి ముగ్గురు సినిమా సెలెబ్రెటీల మధ్య వార్ జరగబోతోంది అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాలలో హాట్ టాపిక్ గా మారాయి.

తెలుగు ప్రజలు రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత తెలంగాణాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడుచు పెట్టుకుపోయింది. ఈనేపధ్యంలో కనీసం పేరుకు మాత్రం అయినా తెలుగుదేశం పార్టీని బ్రతికించాలని చేస్తున్న ప్రయత్నాలలో నందమూరి కుటుంబ వారసుడుగా కళ్యాణ్ రామ్ ను రాబోతున్న తెలంగాణ రాష్ట్ర ఎన్నికలలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుండి పోటీ చేయించి ఇంకా తెలుగుదేశం బ్రతికే ఉంది అన్న గట్టి సంకేతాలు ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ ఆధినాయకత్వం కళ్యాణ్ రామ్ పై తీవ్ర ఒత్తిడి చేస్తోంది.

ఈ సూచనకు కళ్యాణ్ రామ్ పెద్దగా స్పందించక పోయినా నందమూరి కుటుంబ సభ్యులు ద్వారా ఒప్పించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు టాక్. ఇది ఇలా ఉండగా ఇదేస్థానం నుండి ఈమధ్యనే కాంగ్రెస్ లో చేరి రాజకీయాలలోకి వచ్చిన మెగా సినిమాల నిర్మాత బండ్ల గణేష్ కూడ కాంగ్రెస్ తరపున పోటీ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా ఇదే స్థానం పై భారతీయ జనతా పార్టీ తరపున పోటీ చేయడానికి జీవితా రాజశేఖర్ కూడ ఉత్సాహ పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

జూబ్లీహిల్స్ లో ఆంధ్ర ప్రాంతానికి చెందిన అనేకమంది కుటుంబాలతో పాటు ఇదే జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఉన్న కృష్ణానగర్ లో ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన చిన్న నటుల నుండి పెద్ద నటుల వరకు ఎందరో ఉంటున్న నేపధ్యంలో ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన అందరి కళ్ళు జూబ్లీహిల్స్ స్థానం పైనే ఉన్నాయి. ఒకవేళ వస్తున్న వార్తలకు అనుగుణంగా ఈముగ్గురు ఫిలిం సెలెబ్రెటీల మధ్య ఎన్నికల ఫైట్ జరిగితే అది తెలంగాణ ఎన్నికల ముఖ చిత్రంలోనే ఒక హాట్ టాపిక్ గా మారుతుంది..