![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_gossips/rajinikanth-bday-spl-415x250.jpg)
70 ఏళ్లకు చేరువవుతున్నా ఆయన హీరోగా నటించిన చిత్రం వసూళ్లు 500 కోట్ల దాటుతున్నాయి. రాజకీయాల్లో అడుగు పెడుతున్నా.. ఇంకా ఆయన సినిమాల్లోనూ బిజీగానే ఉన్నాడు. వచ్చే ఎన్నికల్లో రాజకీయంగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు. ఆయనే సూపర్ స్టార్ రజినీకాంత్. డిసెంబర్ 12 జన్మదినం సందర్భంగా ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలు తెలుసుకుందాం.
రజినీకాంత్ కుటుంబం గురించి చెప్పాలంటే.. రజనీ తండ్రి పోలీస్ శాఖలో పని చేసేవారు. తొమ్మిదేళ్ల వయసప్పుడే తల్లి చనిపోయారు. ఒక్క అక్క, ఇద్దరు అన్నయ్యలు. ఇంట్లో చిన్నవాడు రజినీయే. తల్లి చనిపోయిన ఏడాదే పెద్దన్నయ్య పెళ్లయింది. ఆ వదినే తల్లిలా రజినీని తీర్చిదిద్దింది. చిన్న అన్నయ్య చనిపోయాడు. ప్రస్తుతం అక్క, పెద్దన్నయ్య ఉన్నారు.
రజినీకాంత్ కి సినిమాల్లో శివాజీ గణేశన్, చరిత్రలో మరాఠా యోధుడు శివాజీ అన్నా చాలా ఇష్టం. ఎంజీఆర్, శివాజీ గణేశన్ సినిమాలు రజినీ బాగా చూసేవాడు. ఆటల్లో ఫుట్బాల్, కబడ్డీ అంటే బాగా ఇష్టపడేవాడు. రజినీ ప్లస్ టూ వరకే చదువుకున్నారు. ఆటల్లో, చదువుల్లో ఫస్ట్ వచ్చేవారు. కానీ ప్లస్ టూ సమయంలోనే ఆయన నాటకాల వైపు మొగ్గుచూపారు. క్రమంగా ఆ ఇష్టం నటనవైపు దారి తీసింది. చదువుకు గుడ్ బై చెప్పేలా చేసింది. ఓ రెండేళ్లు బస్ కండక్టర్గానూ పనిచేశారు రజినీకాంత్..
మద్రాసు వచ్చి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరిన మొదటి రోజుల్లో కుటుంబ సభ్యులతో పాటు స్నేహితులూ ఆర్థికంగా ఆదుకున్నారట. ఆ తర్వాత కొన్నాళ్లకే బాలచందర్ కంట్లో పడటం.. ఆయన శివాజీ రావ్ గైక్వాడ్ ను రజినీకాంత్ గా మార్చడం.. ఆ తర్వాత ఆ కుర్రాడు తమిళ ఆరాధ్య నటుడుకావడం అందరికీ తెలిసిన విషయమే.