మనం జరుపుకునే ప్రతి పండుగ వెనుక ఎదో ఒక ఆధ్యాత్మిక రహస్యం ఉంటుంది. ముఖ్యంగా తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకునే పెద్ద పండుగ సంక్రాంతి. ఈ పండుగలో అనేక ఆధ్యాత్మిక విషయాలు మిళితమై ఉన్నాయి. మన పండుగలు అన్నీ ‘లునార్’ క్యాలెండర్ ని ఆధారం చేసుకుని చంద్రుడి స్థానాన్ని అనుసరించి జరుగుతూ ఉంటాయి.
అందువల్లనే మనం జరుపుకునే చాల పండుగుల తారీఖులు నెలలు మారుతూ ఉంటాయి. అయితే సంక్రాంతి పండుగ మాత్రం ప్రతి సంవత్సరం జనవరి నెలలో మాత్రమే ఖచ్చితంగా వస్తూ జనవరి 14న లేదంటే 15న మకర సంక్రాంతి రావడం కొన్ని వందల సంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది.
సంక్రాంతి పురాతన కాలం నాటి పండుగలలో ఒకటి. ఈ పండుగ తరువాత వసంత కాలం వస్తుంది. సంక్రాంతి ప్రసిద్ది చెందిన పండుగ అయినప్పటికీ ఇది ప్రధానంగా వ్యవసాయ పండుగ. దీన్ని తూర్పు నుండి పశ్చిమం ఉత్తరం నుండి దక్షిణం వరకు భారతదేశం మొత్తం ఈ పండుగను జరుపుకుంటారు. ముఖ్యంగా ఈ పండుగను తమిళనాడులో ‘పొంగల్’ అన్న పేరుతో పిలిస్తే మరికొన్ని ప్రాంతాలలో దీనిని ‘లోహ్రీగా’ జరుపుకుంటారు. ఉత్తరాయన్, మాఘి, ఖిచ్డి, మరి కొన్ని ఇతర పేర్లు కూడ ఈ పండుగకు ఉన్నాయి.
కొన్ని ప్రాంతాలలో నువ్వులు, బెల్లం లడ్డూలు లేదా చిక్కీలు అందరితో ఈ సంక్రాంతి రోజున పంచుకుంటారు. గ్రామీణ వాతావరణంలో జరిగే ఈపండుగ హడావిడి పట్టణ ప్రాంతాలలో పెద్దగా కనిపించకపోయినా కోస్తా జిల్లాలలోని గ్రామాలలో ఇప్పటికీ సంక్రాంతి హడావిడి ఒక వారం రోజులు ముందు నుంచే కనిపిస్తుంది. ఈ పండుగ రోజున ప్రతివ్యక్తి తమ శత్రుత్వాన్ని వదిలేసి కలిసి జీవిద్దాం అనే భావన కూడ ఈపండుగలో ఉంది..