వెన్నుపోటు ఎన్టీఆర్ జీవితంలో అతి కీలకమైన విషాదకరమైన ఘట్టం.. తనవాళ్లు అనుకున్నవాళ్లే.. కుటుంబ సభ్యులే.. అతి దారుణంగా తన నుంచి అధికారం లాక్కోవడం.. ఆయన్ను మానసికంగా చంపేసింది. ఇప్పుడు వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాతో ఈ ఎపిసోడ్ పై చాలా చర్చ జరుగుతోంది.
ఐతే.. అప్పుడు చంద్రబాబుకు సహకరించిన వారిలో నటుడు మోహన్ బాబు కూడా ఉన్నాడట. ఈ విషయాన్ని లక్ష్మీపార్వతి బయటపెట్టారు. ఎన్టీఆర్ కు మోహన్ బాబు అప్పట్లో చాలా సన్నిహితుడిగా - ఆప్తుడిగా ఉండే వారని ఆమె అంటున్నారు. ఎన్టీఆర్ సూచన మేరకు మోహన్ బాబు రాజకీయాల్లోకి వెళ్లాడట.
వెన్ను పోటు సమయంలో ఎన్టీఆర్ ను మోహన్ బాబు కూడా విడిచి వెళ్లాడని - ఆ సమయంలో చంద్రబాబు నాయుడుకు మద్దతుగా మోహన్ బాబు నిలిచాడు అంటూ లక్ష్మీ పార్వతి చెప్పుకొచ్చింది. కొన్నాళ్ల తర్వాత అన్నగారికి అన్యాయం చేశాను అంటూ వచ్చి క్షమాపణలు చెప్పాడు. తప్పు తెలుసుకున్నా కూడా తాను మోహన్ బాబు గురించి తానెప్పుడు కామెంట్స్ చేయాలనుకోలేదు అంటున్నారావిడ.
మోహన్ బాబు విషయమే కాదు. మిగిలిన చాలా విషయాలు ఆమె బయటపెట్టారు. తమ పెళ్లి గురించి చెప్పేందుకు రెండు మూడు సార్లు కుటుంబ సభ్యుల మీటింగ్ ఏర్పాటు చేశారుట. ఆ సమయంలో అంతా కూడా ఆయనకు వ్యతిరేకంగానే మాట్లాడారట. ఆరోగ్యం సరిగా లేని నాకు ఈ సమయంలో భార్య అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. కాని వారు ఎవరు కూడా ఒప్పుకోలేదట.