పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇకపై తన సినిమా జీవితానికి స్వస్తి పలికి పూర్తిగా రాజకీయాలకు పరిమితమవ్వడం ఒక రకంగా ఆయన ఫ్యాన్స్ కి నిరాశ కలిగించే విషయమే చెప్పాలి. ఇకపోతే పవన్ కొడుకు అకీరా అతి త్వరలో సినిమారంగ ప్రవేశం చేయనున్నాడనే వార్తలు కూడా కొద్దిరోజులుగా గుప్పుమంటున్నాయి. ఇక నేడు ఆయన కూతురు ఆద్య పాట పాడిన ఒక వీడియో యూట్యూబ్ లో సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళితే, వీడియోలో ఒక అబ్బాయి పియానో వాయిస్తూ ఉండగా ఆ మ్యూజిక్ తగినట్టుగా ఆద్య తన గొంతుకను సవరించి విజయ్ దేవరకొండ నటించిన టాక్సీ వాలా సినిమాలోని మాటే వినదుగా వినదుగా అనే పాటని ఆలపించింది. ఇక ఈ వీడియోలో ఆధ్యా ను చూస్తే అచ్చం పవన్ ను చూసినట్లుగానే అనిపించకమానదు.
అయితే వీడియోలు ఆద్య ఆలపించిన పాట కొంచెం లో వాయిస్ లో విన పడుతున్నప్పటికీ ఆమె పాట పాడుతున్న విధానాన్ని బట్టి చూస్తే మరికొంత ప్రాక్టీస్ కనక చేసినట్లయితే భవిష్యత్తులో ఆద్య మంచి సింగర్ గా పేరు సంపాదిస్తుంది అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఈ వీడియో చూసిన పవర్ స్టార్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికల్లో దీనిని షేర్లు, లైకులతో విపరీతంగా వైరల్ చేస్తున్నారు.
అయితే ఒక గమ్మత్తయిన విషయం ఏంటంటే నిన్న సూపర్ స్టార్ మహేష్ బాబు కూతురు సితార డాన్సింగ్ వీడియో వైరల్ అయితే నేడు పవర్ స్టార్ పవన్ కూతురు ఆద్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ విధంగా టాలీవుడ్ కు చెందిన ఇద్దరు బడా స్టార్ డాటర్స్ ఒకరితరువాత ఒకరు వార్తల్లో నిలిచి సంచలనంగా మారటం ఒకరకంగా యాదృచ్చికం అనే చెప్పాలి.