భారీ చరిత్రాత్మక చి త్రానికి కథానాయికగా - గెయిటీ, హయిట్, బ్యూటీ, నటన, యాక్షన్ - తో స్వీటీ అనుష్క మెప్పించినంతగా వేరొక నటి మెప్పించటం కొంచెం కష్టమే. దాని ఋజువు 'బాహుబలి సినిమాలో దేవసేన' పాత్ర ప్రత్యక్ష ఉదాహరణ. అలాగే తమిళ యువకుల మోష్ట్ ఫేవరేట్ హీరోయిన్ నయనతార కూడా! కొన్నిసార్లు కాల్ షీట్ పరిస్థితులు అనుకూలించనప్పుడు ఇష్టం లేకపోయినా సినీస్టార్లు త్యాగాలకు సిద్ధపడాల్సి వస్తుంది. ప్రఖ్యాత దర్శకుడు మణిరత్నం కనివిని ఎరుగని రీతిలో భారీ ఎత్తున “పొన్నియన్ సెల్వన్” చారిత్రాత్మక మల్టీ స్టారర్ సినిమా కు ప్లాన్ చేసుకున్న సంగతి తెలిసిందే.
ఎన్నో భారీ చిత్రాలను, వైవిధ్యభరిత ప్రేమకథా చిత్రాలను వెండితెరపై తనదైన శైలిలో ఆవిష్కరించి సంచలన విజయాలను అందుకున్న దర్శకుడు మణిరత్నం. ప్రస్తుతం ఆయన ఒక మహాయజ్ఞానికి సిద్ధం అవుతున్నారు. కల్కి రాసిన చారిత్రాత్మక నవల అయిన ‘పొన్నియన్ సెల్వన్’ కథని వెండి తెరపై ఆవిష్కరించడం తన కలగా పలు సందర్భాల్లో ఆయన పేర్కొన్నారు మణిరత్నం.
ఇప్పుడు పట్టువీడని విక్రమార్కుడిలా పొన్నియన్ సెల్వన్ చిత్రాన్ని తెరకెక్కించడానికి మణి సిద్ధమయ్యారు. ఈసారి మరింత భారీ తారాగణంతో ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. కోలీవుడ్, టాలీవుడ్, మాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు ఈ చిత్రంలో నటిస్తున్నారు. కోలీవుడ్ నుంచి కార్తీ, జయం రవి, విక్రమ్, టాలీవుడ్ నుంచి మోహన్‌బాబు, మాలీవుడ్ నుంచి కీర్తీ సురేశ్, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యరాయ్ వంటి వారు నటించనున్నారు. వీరిలో పొన్నియన్ సెల్వన్ గా టైటిల్ పాత్రలో నటుడు జయం రవి, వందియ దేవన్‌గా కార్తీ, ఆదిత్య కరికాలన్‌గా విక్రమ్, కందవై గా కీర్తీసురేశ్ నటించనున్నారు. సుందరచోళన్‌గా అమితాబ్‌బచ్చన్, పళవేట్టరైయర్ గా మోహన్ బాబు నటించనున్నారు. నటుడు సత్యరాజ్, ఇక మాయామోహిని నందినిగా నటి ఐశ్యర్యరాయ్ నెగిటివ్ పాత్ర పోషించనున్నట్లు సమాచారం.
మరో కీలక పూంగుళలి పాత్రలో అగ్రనటి నయనతార నటించనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుతం విజయ్ స్పోర్ట్స్ డ్రామాతోపాటు రజనీకాంత్‌తో దర్బార్ చిత్రంలో ఆమె నటిస్తుండటంతో, మణి చిత్రానికి కోరిన బల్క్ డేట్స్ ఇవ్వలేని స్థితిలో నయనతార దానికి “నో” చెప్పేసిందని చెన్నై న్యూస్. దీంతో ఆమెకి బదులు మరో అగ్రనటి స్వీటీ అనుష్కను ఆ పాత్రలో నటింపజేయడానికి చర్చలు జరుగుతున్నాయన్నది తాజా సమాచారం.
భాగమతి తరువాత చాలా విరామం తీసుకుని “సైలెన్స్” అనే చిత్రంలో నటిస్తోంది అనుష్క. ఆ తరువాత మణిరత్నం దర్శకత్వంలో పొన్నియన్ సెల్వన్ చిత్రంలో నటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం ఆగస్ట్‌లో సెట్‌పైకి వెళ్లనున్నట్లు సమాచారం. దీనికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
మణిరత్నం పోన్నియన్ సెల్వన్ స్క్రిప్ట్ రాసుకున్నపుడే మొదట అనుష్కనే ఫస్ట్ ఛాయస్ గా పెట్టుకున్నారట. కాని బాహుబలి మేనియాలో ఉన్న ప్రేక్షకులు పోలిక తెస్తారనే అనుమానంతో పాటు మార్కెట్ పరంగా తమిళంలో నయనతార అయితేనే బాగుంటుందని సన్నిహితులు సూచించడంతో నిర్ణయం మార్చు కున్నట్టు తెలిసింది. కాని విధి మరోలా ఉంది. నయన సమయం అనుకూలించక ఈ అవకాశం త్యాగం చేయవలసి రావడంతో మళ్ళి అది అనుష్క కోర్ట్ కే వచ్చేసింది. తను “ఓకే” చెప్పిందా? లేదా? అనే అధికారిక సమాచారం లేదు.
భాగమతి తర్వాత ఏడాది గ్యాప్ తీసుకున్న స్వీటీ ఇప్పటిదాకా కేవలం కోన వెంకట్ నిర్మాణంలో రూపొందే సైలెన్స్ మూవీ మాత్రమే సైన్ చేసింది. సో మణిరత్నం ఆఫర్ కు అనుష్క ఓకే చెప్పే అవకాశాలే ఎక్కువ అంటున్నారు.