ఎన్టీఆర్ బయోపిక్ ఘోర పరాజయం తరువాత బాలకృష్ణ అనేక ఆలోచనలు చేసి ప్రస్తుతం కెయస్ రవికుమార్ దర్శకత్వంలో సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే. ఈసినిమా పూర్తి అయిన తరువాత బాలయ్య బోయపాటిల కాంబినేషన్ మూవీ ఉంటుంది అన్నప్రచారం జరుగుతోంది.
ఇలాంటి పరిస్థుతులలో మొన్న బాలకృష్ణ స్వయంగా దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు ఇంటికి వెళ్ళి సుమారు గంటకు పైగా ఏకాంతంగా కలిసి మాట్లాడటం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. ‘ఆదిత్య 369’ ‘భైరవద్వీపం’ లాంటి ఫ్యాంటసీ జానపద సినిమాలను బాలకృష్ణతో తీసిన సింగీతం పై బాలయ్యకు విపరీతమైన గౌరవం.
గతంలో బాలకృష్ణ 100వ సినిమా ఈయనతోనే ఉంటుంది అని ప్రచారం జరిగినా చివరి నిముషంలో క్రిష్ వచ్చి చేరడంతో ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ రంగంలోకి వచ్చింది. ఆతరువాత మళ్ళీ సింగీతం బాలయ్యలను కలిపిన సంఘటనలు లేవు. ఇలాంటి పరిస్థుతులలో ఇప్పుడు బాలకృష్ణ సింగీతంను ఎందుకు కలిసాడు అన్నవిషయమై ఊహాగానాలు వస్తున్నాయి.
ఎప్పటి నుంచో సింగీతం మనసులో ‘ఆదిత్య 369’ కు సీక్వెల్ ఆలోచనలు ఉన్న నేపధ్యంలో ఆ సీక్వెల్ ఇప్పుడు తీయాలని బాలకృష్ణ భావిస్తున్నాడా లేదంటే ఏదైనా మరో సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ ఈ 80 సంవత్సరాల దర్శకుడుతో ప్లాన్ చేస్తున్నాడా అన్న విషయమై రకరకాల గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. మరికొందరైతే ఈ భేటీ మోక్షజ్ఞను దృష్టిలో పెట్టుకుని జరిగిందని బాలకృష్ణ తాను హీరోగా నటిస్తూ మోక్షజ్ఞ చేత ఒక అతిథి పాత్ర చేయించి ఆ విషయమై అభిమానుల స్పందనను తెలుసుకోవాలి అన్న ఉద్దేశ్యంతో తనకు అదేవిధంగా మోక్షజ్ఞకు పనికివచ్చేది ఏదైనా కథ సింగీతం వద్ద ఉందా అన్న విషయాలను తెలుసుకోవడానికి బాలయ్య ఇలా సింగీతంను కలిసి ఉంటాడు అంటూ ఈ భేటీ వెనుక ఆంతర్యం పై ఊహాగానాలు చేస్తున్నారు..