టాలీవుడ్ సినిమా ఇటీవల కొందరు యువ దర్శకుల రాకతో, ఆకట్టుకునే స్క్రిప్ట్స్ తో మంచి విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే మధ్యలో కొన్ని సినిమాలు మాత్రం, గతంలో వచ్చిన పలు ఇతర భాషా సినిమాలను కాపీ కొట్టి తీయడంతో విమర్శల పాలవుతున్నాయి. ఆ విధంగా గత ఏడాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన అజ్ఞాతవాసి సినిమాను, ఇదివరకు ఫ్రెంచ్ లో తెరకెక్కించిన లార్గో వించ్ అనే సినిమా కథను మరియు, మరియు సన్నివేశాలను కాపీ కొట్టి తీసినట్లు అప్పట్లో పలు మీడియా మాధ్యమాల్లో పెద్ద రచ్చే జరిగింది. ఇక ఆ తరువాత కొద్దిరోజులకు,
ఏకంగా లార్గో వించ్ సినిమా దర్శకుడైన జెరొమ్ సల్లే, తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా, అజ్ఞాతవాసి తన లార్గో వించ్ సినిమాను స్ఫూర్తిగా తీసుకుని, కొంత వరకు తమ ఒరిజినల్ మాతృకను మార్చి తీశారంటూ పోస్టుల పెట్టడం జరిగింది. అయితే ఆ తరువాత కొద్దిరోజులకు ఆ వివాదం సద్దుమణిగింది. ఇక ఇటీవల టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినిమా అభిమానుల్లో విపరీతమైన అంచనాలు పెంచిన సాహో సినిమా, రెండు రోజుల క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చి నెగటివ్ టాక్ ని సొంతం చేసుకుంది. అయితే సినిమా ఎలా వుంది అనే విషయాన్ని ప్రక్కన పెడితే, ఈ సినిమా కూడా అజ్ఞాతవాసి మాదిరిగానే లార్గో వించ్ మూవీని స్ఫూర్తిగా తీసుకుని తెరకెకించారు అనేది, చూసిన వారందరికీ చాలావరకు అర్ధం అవుతుంది. ఇప్పుడు ఇదే చర్చ పలు సోషల్ మీడియా మాధ్యమాల్లో జరుగుతోంది.
ఇక మళ్ళీ అదే లార్గో వించ్ దర్శకుడు జెరోమ్, నేడు సాహో సినిమా విషయమై ట్వీట్ చేయడం జరిగింది. తన సినిమా ను కాపీ కొట్టి తీసిన రెండవ తెలుగు సినిమా సాహో అని, తమ సినిమా కథ, కథనాలను దొంగిలించి మరీ, తెలుగులో తెరకెక్కించిన సదరు దర్శకులు, రెండు సినిమాలను ప్రేక్షకులను ఆకట్టుకునేలా తీయడంలో పూర్తిగా విఫలమయ్యారని అన్నాడు. దీన్ని బట్టి చూస్తే నాకు ఇండియాలో మంచి మూవీ కెరీర్ ఉందంటూ ఆయన సెటైర్ కూడా వేయడం జరిగింది. కాగా ప్రస్తుతం జెరోమ్ చేసిన ట్వీట్, టాలీవుడ్ వర్గాల్లో విపరీతంగా కలకలం సృష్టిస్తోంది. అయితే జెరోమ్ మాటలను కొందరు సమర్దిస్తుంటే, మరికొందరు మాత్రం తప్పుపడుతూ తమ సోషల్ మీడియా మాధ్యమాల్లో కామెంట్స్ చేస్తున్నారు. మరి దీనిపై సాహో మూవీ టీమ్ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి..!!