వివాదాస్పద నటి శ్రీరెడ్డి మరోసారి వార్తల్లోకెక్కారు. వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి మీటూ ఆరోపణల తరువాత టాలీవుడ్ లో ఆఫర్లు రాకపోవడంతో చెన్నైకు మకాం మార్చారు. చెన్నైలో శ్రీరెడ్డికి కొన్ని చిన్న సినిమాలలో, వెబ్ సిరీస్ లలో ఆఫర్లు వస్తున్నాయి. ప్రస్తుతం శ్రీరెడ్డి చెన్నై నగరంలోని అన్భునగర్ ఏరియాలో ఒక ఫ్లాట్ లో నివశిస్తున్నారు. కొన్ని రోజుల క్రితం శ్రీరెడ్డి తన ఫేస్ బుక్ ఖాతాలో తన ఇంటికి సమీపంలో ఒక షూటింగ్ జరుగుతోందని ఆ యూనిట్ గోల భరించలేకపోతున్నానని పేర్కొన్నారు.
నటి తమన్నా నటిస్తున్న వెబ్ సిరీస్ షూటింగ్ అక్కడ జరుగుతోందని వెబ్ సిరీస్ యూనిట్ తో మాట్లాడి ఈ సమస్యను పరిష్కరించుకోవాలని అనుకుంటున్నానని తెలిపారు. ఈ పోస్ట్ పెట్టిన తరువాత సోమవారం రోజు రాత్రి తన ఇంటి ముందు కారు నిలిపి ఉండటంతో శ్రీరెడ్డి తన కారును బయటపెట్టారు. కొంత సమయం తరువాత శ్రీరెడ్డి తన ఖరీదైన ఆడీ కారు మీద గీతలు గీసి ఉండటంతో పాటు కారును ధ్వంసం చేసి ఉండటం గుర్తించింది.
వెంటనే శ్రీరెడ్డి స్థానిక కోయంబేడు పోలీస్ స్టేషన్ లో ఈ విషయం గురించి ఫిర్యాదు చేశారు. శ్రీరెడ్డి ఫిర్యాదులో తాను నివాసం ఉంటోన్న ఇంటికి సమీపంలో ఇక రిటైర్డ్ అధికారి బంగ్లా ఉందని ఆ బంగ్లాలో కొన్ని రోజులుగా షూటింగ్ జరుగుతోందని దీంతో ఆ ప్రాంతంలో కార్లను నిలుపుతున్నారని పేర్కొన్నారు. తన ఇంటి ముందు కూడా ఒక వాహనం నిలిపి ఉండటంతో కారును బయట పెట్టినట్టు శ్రీరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు.
మనోజ్ అనే వ్యక్తిపై తనకు అనుమానం ఉందని అతను షూటింగ్ యూనిట్ కు సంబంధించిన వ్యక్తి అని శ్రీరెడ్డి ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణ జరిపి కారును ధ్వంసం చేసిన వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని శ్రీరెడ్డి కోరారు. కోయంబేడు ఇన్‌స్పెక్టర్ మాదేశ్వరన్ ఈ కేసును నమోదు చేసుకొని కేసు గురించి విచారణ జరుపుతున్నారు. పోలీసులు శ్రీరెడ్డి నివశించే ప్రాంతంలోని సీసీ కెమారా ఫుటేజీలను పరిశీలిస్తున్నారు.