సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చాయి. అతడు సినిమా హిట్ కాగా ఖలేజా సినిమా ఫ్లాప్ అయింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య ఎంతో సాన్నిహిత్యం ఉన్న విషయం తెలిసిందే. సంక్రాంతి పండుగకు మహేష్, అనిల్ రావిపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా విడుదలవుతుండగా త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కిన అల వైకుంఠపురములో సినిమా విడుదల కానుంది. 
 
మొదట అల వైకుంఠపురములో సినిమా, సరిలేరు నీకెవ్వరు నీకెవ్వరు సినిమా జనవరి 12వ తేదీనే విడుదల చేయాలని ఈ రెండు చిత్రాల నిర్మాతలు భావించారు. కానీ ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు ఒకేరోజు రిలీజ్ కావడం మంచిది కాదని రెండు సినిమాల నిర్మాతలు ఒప్పందం చేసుకొని అల వైకుంఠపురములో జనవరి 12వ తేదీన సరిలేరు నీకెవ్వరు జనవరి 11న విడుదల చేయాలని ఇరు చిత్రాల నిర్మాతలు ఒప్పందం చేసుకున్నారు. 
 
కానీ కొన్ని కారణాల వలన అల వైకుంఠపురములో సినిమా నిర్మాతలు తమ సినిమాను కూడా జనవరి 11వ తేదీనే విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో బన్నీ పేరు, అల్లు అరవింద్ పేరు వినిపిస్తోందే కానీ త్రివిక్రమ్ పేరు మాత్రం ఎక్కడా వినిపించటం లేదు. త్రివిక్రమ్ చెబితే హారిక హాసిని యూనిట్ జనవరి 12వ తేదీనే సినిమాను విడుదల చేసే అవకాశం ఉంది. 
 
కానీ త్రివిక్రమ్ మాత్రం మౌనంగా ఉండటంతో మహేష్ కు, త్రివిక్రమ్ కు మధ్య విభేదాలు ఏమైనా మొదలయ్యాయా...? మహేష్ కు, త్రివిక్రమ్ కు ఏ విషయంలోనైనా చెడిందా..? అనే ప్రశ్నలు ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తున్నాయి. గతంలో మహేష్ బాబు కోరటంతో త్రివిక్రమ్ "అ ఆ" సినిమా రిలీజ్ డేట్ పోస్ట్ పోన్ చేశాడని ఇండస్ట్రీలో టాక్ ఉంది. మరి ఒకేరోజు విడుదలైతే రెండు సినిమాలకు నష్టం అని తెలిసినా త్రివిక్రమ్ ఎందుకు ఊరుకుంటున్నారు..? అనే ప్రశ్నకు సమాధానం తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: