మెగాస్టార్ చిరంజీవి నిన్న జరిగిన సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరైన విషయం తెలిసిందే. ఈవెంట్ లో మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ఇకపై స్టార్లంతా ఒకేచోట కలవాలని స్టార్ హీరోల అభిమానులకు ఇలాంటి పండగ వాతావరణమే కావాలని అన్నారు. ఆ తరువాత సంక్రాంతికి విడుదల కాబోతున్న సరిలేరు నీకెవ్వరు సినిమాతో పాటు అల వైకుంఠపురములో, దర్బార్ సినిమాలు బాగా ఆడాలని కోరుకుంటున్నానని అన్నారు. 
 
కళ్యాణ్ రామ్ నటించిన ఎంత మంచివాడవురా సినిమా సంక్రాంతి పండుగకు విడుదల కాబోతున్నప్పటికీ ఆ సినిమా పేరును మాత్రం చిరంజీవి మరిచిపోయారు. ఎంత మంచివాడవురా సినిమాను చిరంజీవి పొరపాటున మరిచిపోయారో లేక కావాలనే ఆ సినిమా పేరును ప్రస్తావించలేదో తెలీదు కానీ నందమూరి అభిమానులు మాత్రం చిరంజీవి ఎంత మంచివాడవురా సినిమా పేరును ప్రస్తావించకపోవడంతో హర్ట్ అయ్యారు. 
 
ఒకవేళ మెగాస్టార్ చిరంజీవి మరిచిపోయినా అక్కడ ఉన్నవాళ్లు చిరంజీవికి ఎంత మంచివాడవురా సినిమా గురించి గుర్తు చేసి ఉంటే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నందమూరి అభిమానులు చిరంజీవి స్పీచ్ ను సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. నందమూరి ఫ్యామిలీ చిరంజీవికి కావాలనే గుర్తుకు రాలేదా...? అని అభిమానులు చిరంజీవిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. 
 
సరిలేరు నీకెవ్వరు, అల వైకుంఠపురములో లాంటి భారీ సినిమాలు విడుదలవుతూ ఉండటంతో ఎంతమంచివాడవురా సినిమాకు అనుకున్నంత బజ్ రావట్లేదు. కానీ ఫ్యామిలీ కథాంశంతో తెరకెక్కుతోన్న సినిమా కావటంతో సంక్రాంతి పండుగకు సరైన సినిమా ఇదే అని నందమూరి అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఈ నెల 8వ తేదీన ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుండగా జూనియర్ ఎన్టీయార్ ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. శతమానం భవతి దర్శకుడు సతీష్ వేగ్నేశ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: