ఏపీ సీఎం వై యస్ జగన్మోహన్ రెడ్డి మెగాస్టార్ కు అతి త్వరలో ఊహించని గిఫ్ట్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. మెగాస్టార్ అంటే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి కాదు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి జగన్ ఊహించని గిఫ్ట్ ఇవ్వబోతున్నారు. ఏపీ సీఎం జగన్ కు మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి సంబంధం ఏమిటి...? మలయాళ మెగాస్టార్ కు ఎందుకు జగన్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారు...? అనే ప్రశ్నలకు మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన యాత్ర సినిమాకు ఉత్తమ నటుడిగా నంది అవార్డ్ లేదా ప్రత్యేక అవార్డ్ ఇవ్వాలని జగన్ భావిస్తున్నాడని సమాచారం.
2019 సంవత్సరం ఫిబ్రవరి 8వ తేదీన మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన యాత్ర సినిమా విడుదలైంది. ఈ సినిమాకు మహి వి రాఘవ దర్శకత్వం వహించాడు. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన ఈ సినిమా ఎవరూ ఊహించని విధంగా సూపర్ హిట్ అయింది. మమ్ముట్టి వై యస్ రాజశేఖర్ రెడ్డి పాత్రలో నటించాడు అని చెప్పేకంటే ఆ పాత్రలో జీవించాడని చెప్పవచ్చు. మమ్ముట్టి నటనకు క్రిటిక్స్ నుండి, ప్రేక్షకుల నుండి ప్రశంసలు వచ్చాయి.
కమర్షియల్ గా కూడా ఈ సినిమా విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ పార్టీ ఘనవిజయం సాధించటంలో ఈ సినిమా పాత్ర కూడా కొంతవరకు ఉంది. జగన్ కూడా అధికారంలోకి రాకముందు అధికారంలోకి వస్తే మమ్ముట్టికి ఉత్తమ నటుడిగా అవార్డు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారట. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత పరిపాలనా కార్యక్రమాలతో బిజీగా ఉండటంతో ఆ విషయమే మరిచిపోయారట.
జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండే ఒక వ్యక్తి ఈ విషయాన్ని జగన్ దృష్టికి తీసుకెళ్లగా అవార్డు ఇచ్చి రుణం తీర్చుకోవాలని జగన్ చెప్పాడని సమాచారం. ఈ విషయం మమ్ముట్టికి తెలియడంతో జగన్ తాను ఊహించని గిఫ్ట్ ఇవ్వనున్నారని సంతోషంలో ఉన్నారట. ప్రభుత్వం మలయాళ మెగాస్టార్ మమ్ముట్టికి నంది అవార్డునే ఇస్తుందా..? లేక ప్రత్యేకమైన అవార్డు ఇస్తుందా...? చూడాల్సి ఉంది.