తెలుగమ్మాయిలకు టాలీవుడ్‌లో అవకాశాలు ఇవ్వరు అంటూ.. తెలుగు హీరోయిన్లు ఇప్పటికే పలు సందర్భాలలో చెప్పి ఉన్నారు. కొందరు టాలీవుడ్ వదిలి కోలీవుడ్‌లో సక్సెస్ అయినవారూ ఉన్నారు. 
అలాగే ఫెయిల్ అయినా వారూ లేకపోలేదు. ఇప్పుడున్న ఒకరిద్దరికి అవకాశాలు వస్తున్నా.. నిలబడలేని పరిస్థితి. అందుకు కారణాలు అనేకం.  అయితే టాలీవుడ్‌లో అంతంత మాత్రంగా అవ‌కాశాల‌తో స‌త‌మ‌వుతున్న వారికి కోలీవుడ్ మాత్రం రెడ్ కార్పెట్ పెట్టి స్వగతం పలుకుతోంది అనడంలో సందేహం లేదు. అవును మరి... మనకెప్పుడూ, ఇంట్లో వండే పులిహోర కంటే.. పొరుగింట్లో వండే బిర్యానీనే కమ్మగా ఉంటుంది... టాలీవుడ్ కూడా సేమ్ టు సేమ్...

 

అందులో ముఖ్యంగా.. అంజలి. మన తెలుగులో అరకొర వేషాలతో సరిపెట్టుకుంటున్న అమ్మడుకి తమిళులు మాత్రం, హారతి పడుతున్నారు. ప్రారంభంలో చిన్న సినిమాలకే పరిమితమైనా.. అందం, అభినయంతో స్టార్ హీరోల సరసన నటించే అవకాశాన్ని కొట్టేసింది. అక్కడ ఒకే జోనర్‌కు పరిమితం కాకుండా ఫ్యామిలీ.. హర్రర్.. కామెడీ.. అన్ని రకాల సినిమాలు చేస్తూ.. స్టార్ హీరోయిన్ హోదా దక్కించుకున్నది. కథానాయికా ప్రాధాన్యమున్న చిత్రాలు చేస్తూ.. అనుష్క, నయనతార వంటి అగ్రనాయికల సరసన చేరింది.

 

ఇక ఆ కోవకే చెందిన మరో తెలుగు భామ బిందు మాధవి. తెలుగులో కేవలం రెండు మూడు సినిమాలతో సిరిపెట్టుకున్న బిందు మాధవికి తమిళనాట అరడజను పైచిలుకు చిత్రాలలో నటించింది. టాలీవుడ్‌ కాదు పొమ్మంటే, కోలీవుడ్‌ రారా రమ్మంటూ అక్కున చేర్చుకుంది ఆమెను. తెలుగు అమ్మాయి అంజలి మాదిరిగానే బిందు మాధవి కూడా అక్కడ మంచి మంచి సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. చేతినిండా సినిమాలున్నా తెలుగు సినిమాలు చేయలేదన్న బాధ మాత్రం ఇలాంటి వారిని తొలిచేస్తూ ఉంటుంది.

 

అదే కోవకు చెందిన మరో బ్యూటీ ఈషారెబ్బా. ఇటీవల తెలుగులో మంచి అవకాశాలు వచ్చినప్పటికీ.. ఈమె కూడా కోలీవుడ్ బాట పట్టింది. ఇక టాలీవుడ్ కాకపోతే కోలీవుడ్ అనుకుంటున్న తెలుగమ్మాయిలకు ఇప్పుడు ఈషా మరో దారి చూపించిందని కూడా అనుకుంటున్నారు.. అదే బాలీవుడ్... అవును. అనిల్ క‌పూర్ త‌న‌యుడు హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ క‌పూర్ బాలీవుడ్ రంగ ప్ర‌వేశం చేయబోతున్నాడు. ఈ యువ క‌థానాయ‌కుడితో క‌లిసి ఈషా రెబ్బా న‌టించ‌నుందట‌. ఈషా రెబ్బా రీసెంట్‌గా ఈ సినిమాకు సంబంధించి ఆడిష‌న్ ఇచ్చింద‌ట‌. గ‌త చిత్రాల్లో ఈషా వ‌ర్క్ న‌చ్చిన ద‌ర్శ‌క నిర్మాత‌లు ఆమెను హీరోయిన్‌గా తీసుకోవ‌డానికి ఓకే అయ్యార‌ట‌. మొత్తానికి, టాలీవుడ్ వీరిని గుర్తించకపోయినా.. మిగిలిన ఉడ్లు వీరిని అక్కున చేర్చుకుంటున్నాయనడంలో సందేహమే లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: