టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం తెలిసిందే. మొన్నటి సంక్రాంతి సీజన్ సందర్భంగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి హిట్ సాధించింది.సంక్రాంతి వలన వరుస సెలవలు కావడం, అలానే మహేష్ బాబు చాలా రోజుల తర్వాత మంచి ఎంటర్టైన్మెంట్ తో కూడిన కమర్షియల్ సినిమాలో నటించడంతో అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులు సైతం సరిలేరు సినిమాను చూడటానికి విపరీతంగా ఆసక్తి కనపరిచారు. ఇక అనుకున్న దానికంటే మరింత గొప్ప విజయాన్ని సరిలేరు అందుకోవడంతో ప్రస్తుతం మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి ఆ విజయానందాన్ని ఎంజాయ్ చేయటానికి విదేశాలకు వెళ్లారు.
ఇక గత ఏడాది సుజిత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సాహో సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. అయితే ఎన్నో అంచనాల మధ్య రిలీజ్ అయిన ఆ సినిమా పెద్దగా సక్సెస్ కాలేదు. దానితో ప్రస్తుతం జిల్ మూవీ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో నటిస్తున్న జాన్ సినిమాపై ప్రభాస్ గట్టిగా ఫోకస్ పెట్టారు. ఇక కొన్నేళ్ళ క్రితం దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ నటించిన బాహుబలి, బాహుబలి 2 సినిమాలు ఎంతటి గొప్ప విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
అయితే కొద్దిరోజులుగా ఫిలిమ్ నగర్ వర్గాల్లో ఒక వార్త విస్తృతంగా ప్రచారం అవుతోంది, అదేమిటంటే ప్రస్తుతం రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో ఆర్ఆర్ఆర్ అనే హిస్టారికల్ మూవీనీ తెరకెక్కిస్తున్న రాజమౌళి, దాని తరువాత మహేష్, ప్రభాస్ లతో కలిసి ఒక భారీ మల్టీస్టారర్ మూవీని తీయనున్నారని, ఒక టాలీవుడ్ బడా నిర్మాత దీనికి ఎంతో భారీ ఖర్చు వెచ్చించనున్నారని టాక్. ఇక నేడు కొందరు రాజమౌళి సన్నిహితుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం, అదంతా ఒట్టి పుకారే అని, ప్రస్తుతం రాజమౌళి దృష్టి మొత్తం ఆర్ఆర్ సినిమా మీదనే ఉందని, అది పూర్తయిన తర్వాతనే ఆయన తదుపరి సినిమా గురించి ఆలోచిస్తారని అంటున్నారు. కాగా దీనితో మహేష్, ప్రభాస్ సినిమా విషయమై ప్రచారం అవుతున్న ఆ వార్తకు చాలావరకు అడ్డుకట్ట పడ్డట్లయింది.....!!