టాలీవుడ్ సీనియర్ నటులు సూపర్ స్టార్ కృష్ణ, రెబల్ స్టార్ కృష్ణం రాజు ఇద్దరూ కూడా ఎన్టీఆర్, ఏఎన్నార్ తరువాత తరంలో పలు సినిమాల్లో నటించి పెద్ద స్టార్స్ గా తమ అద్భుతమైన నటనతో ఎందరో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. తేనె మనసులు సినిమా ద్వారా కృష్ణ సినీ రంగ ప్రవేశం చేయగా, చిలకా గోరింక సినిమా ద్వారా కృష్ణంరాజు సినీ ఎంట్రీ ఇచ్చారు. మొదట్లో కొంత నెగటివ్ పాత్రల్లో నటించిన కృష్ణంరాజు, ఆ తరువాత ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఆపై కొన్నాళ్ళకు హీరోగా మారిన కృష్ణంరాజు, వరుసగా మంచి విజయవంతమైన సినిమాల్లో హీరోగా నటిస్తూ ముందుకు దూసుకెళ్లారు.
ఇక తేనెమనసులు తరువాత సాక్షి, గూఢచారి 116 వంటి సినిమాల్లో నటించిన కృష్ణ, వాటి విజయాలతో ఆయన కూడా మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ దూసుకెళ్లారు. ఇక ఆ విధంగా తమ తమ సినిమాలతో ముందుకు సాగిన ఈ ఇద్దరు హీరోలు కూడా రియల్ గా మంచి స్నేహితులు కూడా. ఇకపోతే కృష్ణ నటవారసుడిగా మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోగా కొనసాగుతుండగా, కృష్ణంరాజు నట వారసుడిగా ఆయన తమ్ముడి కుమారుడు ప్రభాస్ కూడా టాప్ హీరోగా దూకుసుకెళ్తున్నారు. అయితే సినిమాలు, రాజకీయాల పరంగా ఈ ఇద్దరు స్టార్లు ఎన్నో విధాలుగా సేవలందించి ప్రస్తుతం ఇంటివద్దనే ఉంటూ రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే ఇటీవల తన సతీమణి విజయనిర్మల అకాల మరణంతో కృష్ణ ఎంతో కృంగిపోయారు.
ఇక నిన్న ఆమె జయంతి కావడంతో ఆమె విగ్రహాన్ని ప్రత్యేకంగా తయారుచేయించి పలువురు అతిథుల సమక్షంలో ఆవిష్కరించడం జరిగింది. అయితే ఆ వేడుకకు ప్రత్యేక అతిథిగా విచ్చేసిన కృష్ణంరాజు నడవలేని పరిస్థితిని చూస్తే ఆయన ఆరోగ్యం కొంత దెబ్బతిన్నట్లు దాదాపుగా మనకు అర్ధం అవుతుంది. మరోవైపు ఆ వేడుకలో కృష్ణను తీక్షణంగా గమనిస్తే కూడా ఆ విధంగానే గోచరిస్తుంది. అయితే ఆ వేడుకలో వారిద్దరినీ చూసిన వారి అభిమానులు, తమ హీరోల ఆరోగ్య పరిస్థితి చూస్తుంటే ఎంతో దయనీయంగా ఉందని, వారిద్దరూ కూడా అనారోగ్యం నుండి త్వరగా బయటపడి మంచి ఆనందమయమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటూ సోషల్ మీడియా అకౌంట్స్ ద్వారా కామెంట్స్ చేస్తున్నారు.....!!