యావత్ కోలీవుడ్ సినీ పరిశ్రమను కుదిపేసిన సంఘటన అది. ఇండియన్-2 (భారతీయుడు 2) సినిమా షూటింగ్‌లో బుధవారం రాత్రి చోటుచేసుకున్న భారీ ప్రమాదంలో ముగ్గురు మరణించగా, 10 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదం నుంచి కమల్‌హాసన్, కాజల్ అగర్వాల్ తృటిలో తప్పించుకున్నారు. ప్రమాదం జరగడానికి 10 సెకన్ల ముందు వారు అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ప్రాణాపాయం తప్పింది.
మృతుల్లో శంకర్ పర్సనల్ అసిస్టెంట్ మధు(28), అసిస్టెంట్ డైరెక్టర్ సాయికృష్ణ(34), ప్రొడక్షన్ అసిస్టెంట్ చంద్రన్(60) ఉన్నారు. ఇటీవల కమల్ హాసన్, మృతుల కుటుంబాలకు (ఒక్కో కుటుంబానికి రూ.కోటి చొప్పున) రూ.3 కోట్లు ఆర్థికసాయం అందచేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసినదే. కానీ ఈ ఘటనపై ఇప్పటికే పలు కేసులు నమోదయ్యాయి. అయితే తాజాగా ఈ యాక్సిడెంట్ కేసు విచారణను ప్రభుత్వం సీబీసీఐడీకి అప్పగించింది.
ఇప్పటికే ఈ ప్రమాదంపై పోలీసులు నాలుగు సెక్షన్ల కింద కేసులు నమోదు శారు. నిర్మాతలు, క్రేన్ యజమాని, ఆపరేటర్, ప్రొడక్షన్ మేనేజర్‌పై కేసులు నమోదయ్యాయి. వీరితోపాటు నటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్‌కు సమన్లు జారీ చేశారు. షూటింగ్’ సందర్భంగా వినియోగించిన భారీ క్రేన్ ఆపరేటన్ రాజన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సినిమా షూటింగ్‌లో పాల్గొన్న మొత్తం 22 మంది వాంగ్మూలాన్ని రికార్డ్ చేయనున్నారు.
సాధారణంగా సినిమా షూటింగ్‌లకు 60 అడుగుల భారీ క్రేన్‌కు మాత్రమే అనుమతులు ఉంటాయి. కానీ, భారతీయుడు 2 కోసం 100 అడుగుల క్రేన్ వాడారు. తాను ఎంత చెప్పినా కెమెరామన్, ప్రొడక్షన్ బృందం పట్టించుకోలేదని క్రేన్ ఆపరేటర్ రాజన్ వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. అంతకుముందు భారతీయుడు 2 సెట్‌లో జరిగిన క్రేన్ ప్రమాదంపై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఉన్నట్లుండి 150 ఫీట్స్ ఎత్తు నుంచి క్రేన్ పడిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు.