ఆమె ఎన్టీఆర్ భార్య.. భర్త మరణం తర్వాత కొన్నాళ్లు రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉంది. ఎన్టీఆర్ బతికుండగానే పార్టీని చంద్రబాబు కబ్జా చేసినప్పుడు రాజకీయ పోరాటం చేసింది. అన్న తెలుగుదేశం అంటూ సొంత పార్టీ పెట్టుకుంది. ఆమె లక్ష్మీ పార్వతి. కానీ రాజకీయాల్లో ఆమె రాణించలేకపోయారు. ఆ తర్వాత చాలా కాలానికి మళ్లీ ఆమె జగన్ పార్టీ వైసీపీలో చేరారు. ప్రసుతం ఆమె తెలుగు అకాడమీకి ఛైర్మన్ గా ఉన్నారు.
అలాంటి లక్ష్మీ పార్వతి ఇప్పుడు ముఖానికి మేకప్ వేసుకుంటున్నారు. తన భర్త దశాబ్దాల తరబడి ఏలిన సినీరంగంలో అడుగు పెట్టారు. రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తున్న లక్ష్మీ పార్వతి తొలిసారి ఓ సినిమాలో నటించబోతున్నారు. అందులోనూ ఆమెది ఆ సినిమాలో కీలక పాత్ర. ఇంతకీ ఈ సినిమా పేరేంటో చెప్పలేదు కదూ. అదే ‘రాధాకృష్ణ . ఈ సినిమాలో అనురాగ్, ముస్కాన్ శెట్టి జంటగా నటించారు.
ఈ రాధాకృష్ణ సినిమాకు ప్రసాద్ వర్మ దర్శకత్వం వహించారు. ‘ఢమరుకం’ శ్రీనివాస్ రెడ్డి సమర్పణలో హరిణి ఆరాధ్య క్రియేషన్స్ పతాకంపై పుప్పాల సాగరిక, శ్రీనివాస్ కానూరు నిర్మించారు. కనుమరుగవుతున్న నిర్మల్ కొయ్య బొమ్మల కథ నేపథ్యంలో ఈ సినిమా ఉంటుంది. అందరి హృదయాలను హత్తుకునే ఆప్యాయతలు ఉంటాయి. పల్లె వాతావరణంలోని అన్ని రకాల భావోద్వేగాలతో కూడిన ఒక అందమైన ప్రేమకథ ఇది.
ఈ సినిమాను ఎక్కడా రాజీ పడకుండా అనుకున్న విధంగా చిత్రీకరించామని నిర్మాతలు చెబుతున్నారు. నిర్మాణానంతర కార్యక్రమాలు అతి త్వరలో పూర్తి చేసి, ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామంటున్నారు. ఈ సినిమాలో లక్ష్మీ పార్వతితో పాటు సంపూర్ణేష్ బాబు, అలీ , కృష్ణ భగవాన్, చమ్మక్ చంద్ర ఇతర పాత్రల్లో నటించారు. అయితే లక్ష్మీపార్వతికి సినీరంగం కొత్తేమీ కాదు. ఆమె తన తనయుడిని కూడా సినీహీరో చేయాలని ప్రయత్నించారు. కానీ విఫలమయ్యారు. మరి లక్ష్మీ పార్వతి ఈ ఒక్క సినిమాతో ఆగుతారా.. లేక మరిన్ని సినిమాలు చేస్తారా అన్నది చూడాలి.