బన్నీ, సుకుమార్ కాంబినేషన్ మూవీ పుష్ప మల్టీ స్టారర్ అవతారమెత్తింది. అది ఇంపార్టెంట్ రోలో.. గెస్ట్ రోలో గానీ.. బన్నీ సినిమాలో ఓ యంగ్ స్టార్ నటిస్తున్నాడట. దీంతో పుష్ప సోలో హీరోగా కాకుండా.. పుష్ప మల్టీ స్టారర్ మూవీగా రూపొందుతోంది. బన్నీతో కలిసి నటిస్తున్న ఆ స్టార్ ఎవరో తెలుసా..
పుష్పలో విలన్ గా బాలీవుడ్ సీనియర్ హీరో సునీల్ శెట్టి నటిస్తున్నారు. మరోవైపు జగపతి బాబు కూడా ఉన్నాడు. ఈ ఇద్దరూ సహాయనటులు.. ప్రతినాయక పాత్రల్లో స్థిరపడిపోయాడు. వీళ్లున్నంత మాత్రాన పుష్ప మల్టీస్టారర్ మూవీ కాలేదు. కన్నడ యంగ్ స్టార్ ధనుంజయ పుష్పలో నటిస్తున్నాడట.
బన్నీ కెరీర్ లో పుష్ప తొలి పాన్ ఇండియాగా తెరకెక్కుతోంది. బన్నీకి మళయాళంలో మంచి క్రేజ్ ఉంది. అక్కడి నటీనటులు సినిమాలో లేకపోయినా.. నష్టమేమీ లేదు. తెలుగు సినిమాలకు కన్నడలో మంచి మార్కెట్ ఉన్నా.. దీన్ని రెట్టింపు చేసుకునే ప్లాన్ లో ఉన్నాడు బన్నీ. దీంతో పుష్ప సినిమా కోసం అక్కడి యంగ్ స్టార్ ధనుంజయను తీసుకున్నారట. ప్రస్తుతం నాలుగయిదు కన్నడ చిత్రాల్లో బిజీగా ఉన్న ధనుంజయ రామ్ గోపాల్ వర్మ సమర్పించిన భైరవగీతలో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు.
పుష్ప విలన్ గా ముందుగా విజయ్ సేతుపతిని అనుకుంటే.. డేట్స్ ప్రాబ్లమ్ తో తప్పుకున్నాడు. ఇప్పుడీ ప్లేస్ ను బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టితో భర్తీ చేసుకున్నారు. . ఇక సునీల్ శెట్టితో బాలీవుడ్ మార్కెట్ ను కవర్ చేయాలన్న ఆలోచనలో ఉంది చిత్ర యూనిట్.
పుష్పకోసం విలన్ నుంచి ఐటం గర్ల్ వరకు బాలీవుడ్ నుంచే దిగుమతి చేసుకుంటున్నారు. ఐటం సాంగ్ కు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చే సుకుమార్ బాలీవుడ్ హాట్ బ్యూటీ, ఊర్వశి రౌతాలాతో ఐటం సాంగ్ చేయిస్తున్నాడట. మొత్తానికి పుష్ప పాన్ ఇండియా మూవీగా హంగులు దిద్దుకుంటోంది.