
టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన చిత్రాల్లో.. `సింహాద్రి` సినిమాను మాత్రం ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేరు. నూనూగు మీసల టైంలోనే రికార్డుల చెడుగుడు ఆడిన సినిమా అది. ముఖ్యంగా ఎన్టీఆర్ సత్తా ఏంటో చాటి చెప్పిన సింహాద్రి అప్పట్లోనే ఎన్నో రికార్డులను సృష్టించింది. 2003లో విడుదలైన ఈ యాక్షన్ చిత్రం ఎన్టీఆర్ కెరీర్లో ఓ మైలురాయి అని చెప్పొచ్చు. ఇక టాలీవుడ్ ఆల్ టైం టాప్ గ్రాస్సర్ గా రికార్డ్ నెలకొల్పిన ఈ చిత్రం 100 డేస్ 175 సెంటర్స్, 175 డేస్ 52 డైరెక్ట్ సెంటర్స్ లో ఆడి సంచలనం క్రియేట్ చేసింది. మరియు అప్పట్లో ఈ సినిమా 28 కోట్ల షేర్ వసూలు చేసి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.
దీన్ని బట్టే సింహాద్రి స్టామినా ఏంటో అర్థం చేసుకోవచ్చు. అంతేకాదు.. గోదావరి పుష్కరాల ప్రారంభానికి కొద్ది రోజుల ముందు విడుదలైన ఈ సినిమా చూసేందుకు జనాలు పోటెత్తారు. దీంతో థియేటర్లు పుష్కర ఘాట్లను తలపించాయి. ముఖ్యంగా ఈ సినిమాలో సింగమలై గా ఎన్టీఆర్ నటనకు ప్రేక్షకులు పట్టం కట్టారు. కేవలం 20 ఏళ్ల వయసులోనే తన ఏజ్ కి మించిన రోల్ లో అద్బుతనటనను కనబరిచిన ఎన్టీఆర్ అప్పటి స్టార్ హీరోల౦దరికీ వణుకు పుట్టించాడు. ఇక అప్పటికే ఆది సినిమాతో క్రేజీ హీరోగా మారిన జూనియర్ ఎన్టీఆర్ ను సింహాద్రి ఏకంగా నెంబర్ వన్ గా మార్చేసింది.
రాజమౌళికి ఇది కేవలం రెండో సినిమా కావడం మరో విశేషం. అలాగే తమిళ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ కి స్పెషల్ షో వేసి చూపించగా ఎన్టీఆర్ కెరీర్ గురించి ఆయన అప్పట్లోనే తెగ భాదపడ్డారు. ఇలాంటి ట్రెండ్ సెట్టింగ్ సినిమా తరువాత ఆ స్థాయి హిట్ కొట్టడం చాలా కష్టం అన్నారు, ఆయన అన్నట్లుగానే జరిగింది. రజినీకాంత్ ఈ రీమేక్ చేయడానికి ముందుకు రాకపోవడంతో మరో సూపర్ స్టార్ విజయ్ కాంత్ ఆ సినిమాను `గజేంద్ర` పేరుతో రీమేక్ చేశాడు. అలాగే కన్నడలోనూ దునియా విజయ్ `కాంతీరవ్వ` పేరుతో రీమేక్ చేశాడు. కానీ ఈ రెండు భాషల్లో కూడా సింహాద్రి రీమేక్ ఆల్ టైం డిసాస్టర్ గా మిగిలింది. రెండు భాషల్లో నటించిన స్టార్ హీరోలు ఎన్టీఆర్ నటనలో పది శాతం కూడా నటించలేదు అని విమర్శలు గుప్పించారు.