మూడేళ్ళ క్రితం వివి వినాయక్ దర్శకత్వంలో వచ్చిన ఖైదీ నెంబర్ 150 సినిమా తో తెలుగు సినిమా పరిశ్రమకు నటుడిగా కొన్నేళ్ల తరువాత రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ చిరంజీవి, ఆ తరువాత ప్రముఖ తొలితరం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడం జరిగింది. ఇక ప్రస్తుతం ఆయన హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ఆచార్య. ఇప్పటికే కెరీర్ పరంగా దర్శకుడిగా వరుసగా విజయాలు అందుకుంటూ దూసుకెళ్తున్న కొరటాల, ఈ సినిమాలో కూడా మెగాస్టార్ ఇమేజ్ కి తగ్గట్లు మంచి పవర్ఫుల్ స్టోరీ ని సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష ఎంపికయినప్పటికీ, ఇటీవల కొన్ని కారణాల వలన ఆమె సినిమా నుండి తప్పుకోవడం, అలానే ఆమె స్థానే మరొక స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ని మూవీ యూనిట్ ఎంపిక చేయడం జరిగింది. ఇక ప్రస్తుతం కొద్దిరోజులుగా మన దేశం మొత్తం కూడా కరోనా వ్యాధి ప్రబలకుండా లాక్ డౌన్ అమలవుతుండడంతో మిగతా సినిమాల మాదిరిగా ఆచార్య షూటింగ్ కూడా నిలిపివేయడం జరిగింది. ఇప్పటికే 40 శాతానికి పైగా షూటింగ్ జరుపుకున్న ఈ సినిమాలోని ఒక కీలక పాత్ర కోసం రామ్ చరణ్ లేదా మహేష్ బాబు లలో ఎవరో ఒకరిని తీసుకోనున్నట్లు ఇటీవల దర్శకుడు శివ ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు.
కాగా ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఈ సినిమాలో కొన్ని కీలక మార్పులు చేస్తున్నాడట కొరటాల. అయితే ముందుగా అనుకున్న విధంగా కథలో ఎటువంటి మార్పులు లేవని, కానీ సినిమాలో అవసరం అయిన మేరకే సన్నివేశాలు ఉంచాలని, లెంగ్త్ పరంగా అవసరం లేని వాటిని ఇప్పుడే గుర్తించి తొలగించే పనిలో ఉందట కొరటాల టీమ్. కాగా ఇది ఒకరకంగా మంచిదే అని, ఈ లాక్ డౌన్ వలన దర్శకులకు తాము తెరకెక్కిస్తున్న సినిమా కథల్లో లోపాలుంటే సరిచేసుకునే అవకాశం దొరకడం ఒకరకంగా మంచిదే అని అంటున్నారు సినీ విశ్లేషకులు.....!!