దాదాపుగా 13 సంవత్సరాల క్రితం శ్రీను వైట్ల దర్శకత్వంలో కుర్వ శంకర్ యాదవ్ నిర్మాతగా తెరకెక్కిన సినిమా ఢీ. మంచు విష్ణు హీరోగా జెనీలియా డిసౌజా హీరోయిన్ గా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. వాస్తవానికి అంతకముందు వరకు కెరీర్ పరంగా కొంత సతమతం అవుతున్న విష్ణుకు, ఢీ సినిమా పెద్ద బ్రేక్ ని ఇచ్చింది అనే చెప్పాలి. అత్యద్భుతమైన కామెడీ తో కొంత ఆకట్టుకునే ట్విస్టులతో తెరకెక్కిన ఈ సినిమాలో అతి ముఖ్యమైన చారి పాత్రలో ప్రముఖ కమెడియన్ బ్రహ్మానందం అనితర సాధ్యమైన నటనను కనబరిచి తెలుగు ప్రేక్షకుల మనసులు దోచారు. 

 

ఇక సినిమాలో ఆద్యంతం కొనసాగే ఆయన పాత్ర వచ్చినప్పుడల్లా థియేటర్స్ లో నవ్వులే నవ్వులు. హీరోగా విష్ణు కూడా అదిరిపోయే రేంజ్ లో పెర్ఫార్మన్స్ ని కనబరిచారు. హీరోయిన్ జెనీలియా అందాలతో పాటు ప్రసాద్ మురెళ్ళ ఫోటోగ్రఫి, అలానే ముఖ్యంగా సంగీత దర్శకుడు చక్రి అందించిన సాంగ్స్, బ్యాక్ గ్రౌడ్ స్కోర్ ఈ సినిమాకు మంచి మేలు చేసాయి. ఇకపోతే సినిమాలో హీరోయిన్ అన్న పాత్రలో నటించిన దివంగత నటుడు రియల్ స్టార్ డాక్టర్ శ్రీహరి ఎంతో గొప్పగా నటించారని చెప్పాలి. ముఖ్యంగా ఆయనకు, బ్రహ్మానందానికి మధ్య వచ్చే సీన్స్ అయితే కడుపుబ్బా నవ్విస్తాయి. మధ్యలో వచ్చే కొన్ని ఆసక్తికర ట్విస్టులతో పాటు మంచి హృద్యమైన ఎమోషన్స్, లవ్, యాక్షన్ వంటి అంశాలను కలగలిపి దర్శకుడు శ్రీను వైట్ల ఈ సినిమాని తెరకెక్కించారు. 

 

ఇకపోతే ఈ సినిమాకు సీక్వెల్ ఎప్పుడు వస్తుందా అని ప్రేక్షకులు ఎన్నో రోజులుగా ఎదురుచూపులు చూస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూ లో విష్ణు మాట్లాడుతూ ఢీ2 విషయమై అందరూ నన్ను అడుగుతున్నారని, అయితే అటువంటి వారందరూ నన్ను కాకుండా దర్శకుడు శ్రీను గారిని అడిగితే బాగుంటుంది అని చెప్పడం జరిగింది. కాగా నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి చూస్తే, ప్రస్తుతం లాక్ డౌన్ నేపథ్యంలో ఢీ2 సినిమా స్క్రిప్ట్ ని ఎంతో పకడ్బందీగా దర్శకుడు శ్రీను వైట్ల సిద్ధం చేస్తున్నట్లు చెప్తున్నారు. అన్ని అనుకున్నట్లు జరిగితే లాక్ డౌన్ అనంతరం ఈ సినిమా ప్రారంభం అవుతుందని టాక్. మరి ఇదే కనుక నిజం అయితే మాత్రం ఈ మరొకసారి శ్రీను వైట్ల, విష్ణు ల కాంబోలో మరొక నవ్వుల చిత్రాన్ని చూడవచ్చు.....!!

మరింత సమాచారం తెలుసుకోండి: