కళ్ల ముందు స్వర్గం కనిపించింది. దేవకన్య మెరిసింది. అది  ఓ అందమైన దృశ్యకావ్యం. ఆ అద్భుత చిత్రమే జగదేకవీరుడు అతిలోక సుందరి. ఈ చిత్రం గురించి ఎంత ఎక్కువగా చెప్పినా తక్కువే. ఈ సినిమాకు ఆరుగురు రచయితలుగా పనిచేశారు. వీళ్లల్లో ఒక హీరో కూడా ఉన్నాడు. ఆరుగురి సమిష్టి కృషితో వెండితెరపై అందమైన చందమామ వెలిగిపోయింది. 

 

చిరంజీవి, రాఘవేంద్రరావు కాంబినేషన్ లో వచ్చిన బ్లాక్ బస్టర్ 1990 మే 9న రిలీజ్ అయింది. సినిమా రిలీజై 30 సంవత్సరాలు పూర్తైన సందర్బంగా వైజయంతి మూవీస్ ఓ వినూత్న కార్యక్రమానికి తెరలేపింది. సినిమాకు సంబంధించి ఇప్పటి వరకూ బయటకురాని ఎన్నో ఆసక్తికర విశేషాలను నానీతో చెప్పిస్తున్నారు. 

 

జగదేకవీరుడు అతిలోక సుందరి కథ తయారు కావడానికి ఆరుగురు కష్టపడ్డారు. మూల కథను కోడైరెక్టర్ కమ్ రైటర్ శ్రీనివాసచక్రవర్తి అందించాడు. యండమూరి కథ.. జంధ్యాల మాటలు అని టైటిల్స్ లో పడగా.. దీని వెనుక ఆరుగురు రచయితల కష్టం ఉంది. ఇప్పటి టాప్ రైటర్ విజయేంద్రప్రసాద్.. దేవిశ్రీ ప్రసాద్ తండ్రి సత్యమూర్తి రచనా సహకారం అందించారు. చిరంజీవి నెలరోజుల పాటు కథా చర్చలో పాల్గొని సలహాలు.. సూచనలు ఇవ్వడం విశేషం. 

 

జగదేకవీరుడు అతిలోక సుందరి కోసం మెగాస్టార్ చిరంజీవి తన లుక్ ఎలా ఉండాలో తనే నిర్ణయించుకున్నాడు. ఇక శ్రీదేవి తన కాస్ట్యూమ్స్ ను తానే డిజైన్ చేయించుకుంది. అందాల దేవకన్యలా ఆ సినిమాలో మెరిసిపోయింది. 30ఏళ్ల జగదేక వీరుడు అతిలోక సుందరి గురించి తెలియని విషయాలు చెప్పేక్రమంలో.. దీని వెనుకున్న రచయితలతో పాటు.. హీరో కూడా ఉన్నాడని వైజయంతీ మూవీస్ తెలియజేసింది. మొత్తానికి జగదేకవీరుడు అతిలోక సుందరి ఇప్పటికీ అందమైన దృశ్యకావ్యంగా ప్రేక్షకుల మదిలో మిగిలిపోయింది. జగదేకవీరుడు అతిలోక సుందరి ఈ తరమే కాదు రాబోయే తరాలు ఈ చిత్రం చూసినపుడు ఆశ్చర్యంవేయక మానదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: