నవరస కళా పోషకుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు.. పాత్ర ఏదైనా సరే.. ఘట్టమేదైనా సరే నట విజృంభణ చూపించాల్సిందే. తెలుగు ప్రేక్షకులకు కృష్ణుడు అంటే రామారావే అనేలా ఆయన ప్రేక్షక హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. ఎక్కడో నిమ్మకూరు అనే చిన్న గ్రామంలో లక్ష్మయ్య చౌదరి, వెంకట రామయ్య దంపతులు జన్మించిన ఎన్టీఆర్ నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా, రాజకీయ నాయకుడిగా తెలుగు సినీ ప్రపంచంలో తనదైన ముద్ర వేశారు.
విజయవాడ మున్సిపల్ హైస్కూల్ లో ప్రైమరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన ఎన్టీఆర్ అక్కడే ఎస్.ఆర్.ఆర్ కాలేజీలో డిగ్రీ కంప్లీట్ చేశారు. 1942 మేలో మేనమామ కూతురు బసవ తారకంను పెళ్లి చేసుకున్నారు. నేషనల్ ఆర్ట్ థియేటర్ గ్రూప్ నాటక సంస్థను స్థాపించి జగ్గయ్య, నాగభూషణం, కెవిఎస్ శర్మ లాంటి వారితో కలిసి నాటకాలు వేశారు.
సబ్ రిజిస్టార్ జాబ్ ను సైతం వదిలి నట మీద ఆసక్తితో బి.ఏ సుబ్బారావు గారి సహకారంతో ఎల్వి ప్రసాద్ ను కలిసి పల్లెటూరి పిల్ల సినిమాలో కథానాయుడిగా చేశారు. అయితే ఆ సినిమా కన్నా ముందు మనదేశం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. పల్లెటూరి పిల్ల, షావుకారు సినిమాల్లో ఆయన నటనకు ప్రేక్షకుల మన్నలను పొందారు. పాతాళభైరవి సినిమాతో స్టార్ ఇమేజ్ తెచ్చుకున్నారు ఎన్టీఆర్. మల్లీశ్వరి, పెళ్లి చేసి చూడు, చంద్రహారం సినిమాలతో ఎన్టీఆర్ క్రేజ్ తారాస్థాయిలో చేరింది.
మాయాబజార్ లో కృష్ణుడిగా ఎన్టీఆర్ ను ప్రేక్షకులు యాక్సెప్ట్ చేస్తారా అన్న డౌట్స్ చెరిపేస్తూ తెలుగు ప్రజల్లో కృష్ణుడిగా చిరస్ధాయిలో నిలిచారు ఎన్టీఆర్. పౌరాణికం, జానపదం సినిమాల్లో ఎన్టీఆర్ తన స్థాయిలో ఆకట్టుకున్నారు. ఎన్టీఆర్ కెరియర్ లో సర్దార్ పాపారాయుడు, బెబ్బులి పులి, జస్టిస్ చౌదరి లాంటి సినిమాల్లో ఎన్టీఆర్ నటన ప్రేక్షకులను మెప్పించింది. హీరోగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా సెన్సేషన్స్ క్రియేట్ చేశాడు ఎన్టీఆర్. దానవీర శూర కర్ణ సినిమాను నిర్మించి డైరెక్ట్ చేసిన ఎన్టీఆర్ సినిమాలో ఏకంగా మూడు పాత్రల్లో కనిపించారు. తెలుగు సినిమా అనగానే గుర్తొచ్చే మొదటిపేరు ఎన్టీఆర్.. ఎన్ని ప్రయోగాలు చేయాలో అన్ని చేసి తెలుగు సినిమా.. తెలుగు జాతి గర్వపడేలా చేసిన మహనీయుడు ఎన్టీఆర్.