లెక్కల మాస్టారు సుకుమార్ ప్రస్తుతం స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తో తెరకెక్కిస్తున్న తాజా చిత్రం 'పుష్ప'. ఈ సినిమా బన్నీ - సుక్కు కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమా అన్న సంగతి తెలిసిందే. ఇక సుకుమార్ 'రంగస్థలం' వంటి బ్లాక్ బస్టర్ అలాగే అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' వంటి ఇండస్ట్రీ రికార్డ్ క్రియోట్ చేసిన సినిమాల తర్వాత రూపొందిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా మీద ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఇక ఇప్పటికే అయిదు భాషలకి సంబంధించిన పోస్టర్ రిలీజ్ కావడం కూడా సినిమా మీద అంచనాలు అమాంతం పెంచేసింది. ఇప్పటికే ఒక షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా నె క్స్ట్ షెడ్యూల్ కి కేరళ వెళ్లాలని సుకుమార్ బృందం ప్లాన్ చేసారు. కానీ దేశవ్యాప్తంగా ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఆ ప్లాన్స్ అన్ని మారిపోయాయి. కరోనా మహమ్మారితో ఇప్పట్లో బయట రాష్ట్రాలకు వెళ్లే పరిస్థితి కూడా లేదు. దాంతో కేరళ షెడ్యూల్ పూర్తిగా రద్దు చేసుకున్నారని తాజా సమాచారం. ఇక ముఖ్యంగా ఈ సినిమా శేషాచలం అడవుల్లో ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు సుకుమార్.
ఇక ఈ సినిమాలో ఎక్కువ భాగాన్ని దట్టమైన అడవుల్లో షూటింగ్ చేయాలని ముందు కేరళ రాష్ట్రాన్ని ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు నెలకొన్న పరిస్థితుల కారణంగా లోకల్ గానే షూటింగ్ చేయాలని చిత్ర యూనిట్ భావిస్తున్నారట. అందుకే మన తెలుగు రాష్ట్రాల్లోనే దట్టమైన అడవులతో ఉండే ప్రదేశాలను.. షూటింగ్ కి అనుకూలంగా ఉండే ప్రదేశాలను చిత్ర బృందం వెతికే పనిలో ఉన్నారని తెలుస్తోంది. దానికోసం గోదావరి పరిసర ప్రాంతాలను.. చిత్తూరు అడవులను పరిశీలించారట. చివరికి సుకుమార్ అనుకున్నట్టుగా పశ్చిమ గోదావరి జిల్లా రంపచోడవరం ప్రాంతంలోని మారేడ్పల్లి దట్టమైన అడవుల్లో షూటింగ్ చేయాలని నిర్ణయించుకున్నారట. మొత్తానికి ఈ సినిమాకి అనుకున్న ప్లేస్ వెతకడం సుకుమార్ బన్ని లకి పెద్ద సమస్యగానే మారిందని ఆ సమస్య ఇప్పుడు తీరిందని చెప్పుకుంటున్నారు.
ఇక 'పుష్ప' సినిమాని తెలుగుతో పాటు తమిళ మలయాళ కన్నడ హిందీ భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు. పక్కా మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో బన్నీ లారీ డ్రైవర్ గా కనిపించనున్నాడు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ మరియు ముత్యంశెట్టి మీడియా సంయుక్తంగా నిర్మిస్తున్నారు.