మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం 'క్రాక్' సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్లో 66వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ మూవీకి గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. రవితేజ పవర్ ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్న ఈ సినిమాలో శృతిహాసన్, వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రవితేజ - గోపిచంద్ మలినేనిల కాంబినేషన్ లో ఇంతకముందు వచ్చిన 'డాన్ శీను' 'బలుపు' చిత్రాలు మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు 'క్రాక్' సినిమాతో హ్యాట్రిక్ హిట్ కోసం రెడీ అవుతున్నారు. ఇప్పటికే విడుదలైన సినిమా పోస్టర్స్ అంచనాలను పెంచేసింది. మేజర్ పార్ట్ షూటింగ్ జరుపుకున్న 'క్రాక్' చిత్రాన్ని ఈ ఏడాది సమ్మర్లో సినిమాను విడుదల చేయాలని అనుకున్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ వాయిదా పడింది.
ఇదిలా ఉండగా ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ నెగిటివ్ రోల్ లో కనిపించబోతోందని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. దీనిని నిజం చేస్తూ ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఆమె లుక్ ప్రతినాయకి ఛాయలు ఉన్నట్లుగానే అనిపించాయి. అయితే ఇప్పుడు ఆమె క్యారెక్టర్ గురించి మరో అప్డేట్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ 'జయమ్మ' అనే పాత్రలో కనిపిస్తోంది. పోలీసాఫీసర్ అయిన రవితేజ తన భర్తను ఎన్కౌంటర్ చేసినందుకు గాను అతనిపై పగ బట్టి రివేంజ్ తీర్చుకోవాలని చూసే యువతిగా కనిపిస్తోందట. రవితేజ - వరలక్ష్మీ ల మధ్య వచ్చే సన్నివేశాలు ఆసక్తికరంగా ఉంటాయట.
అంతేకాకుండా ఈ సినిమాలో తమిళ నటుడు సముద్రఖని 'కటారి' అనే నెగిటివ్ రోల్ లో కనిపించబోతున్నాడు. కాగా 'డిస్కో రాజా' సినిమాతో నిరాశ చెందిన రవితేజ ఈ సినిమాతో మళ్ళీ ట్రాక్ ఎక్కుతాడని నమ్మకంగా ఉన్నారు ఫ్యాన్స్. మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఈ సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. గుంటూరు ఒంగోలు పరిసర ప్రాంతాల్లో జరిగిన కొన్ని వాస్తవ ఘటనలను ఆధారంగా చేసుకొని తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సరస్వతి ఫిల్మ్ డివిజన్ ప్రొడక్షన్స్ లో 'ఠాగూర్' మధు నిర్మిస్తున్నాడు.