టాలీవుడ్ లో మల్టీస్టారర్ ట్రెండ్ నడుస్తోంది. మంచి కథ దొరికితే అందుకు సిద్ధమంటున్నారు మన స్టార్ హీరోలు. ఆర్ఆర్ఆర్ తో మల్టీస్టారర్ చిత్రాలకు మరింత ఊపందుకుంది. అందుకే రానా, రవితేజ కాంబినేషన్ కు రంగం సిద్ధమవుతోంది. ఓ మళయాళ రీమేక్ కోసం, ఈ క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్టు సమాచారం. 

 

ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఆర్ఆర్ఆర్.. మల్టీస్టారర్ చిత్రాలకు మరింత ఆజ్యం పోసింది. దాంతో టాలీవుడ్ హీరోలు కలిసి నటించేందుకు తెగ ఆసక్తి చూపిస్తున్నారు. అందులో భాగంగా రవితేజ, రానాతో కలిసి ఓ మల్టీస్టారర్ సినిమాలకు ప్లాన్ చేస్తున్నారు. డిస్కో రాజాతో సక్సెస్ ట్రాక్ ఎక్కలేకపోయిన రవితేజ.. ప్రస్తుతం నటిస్తున్న క్రాక్ చిత్రంపైనే ఆశలు పెట్టుకున్నాడు.దీని తర్వాత రానాతో సినిమా చేయబోతున్నాడు. 

 

మల్టీస్టారర్ చిత్రాలకు ఎప్పుడూ ఒక అడుగు ముందుండే రానా.. ప్రస్తుత పరిస్థితులు అనుకూలంగా మారాక, అరణ్య మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. అలాగే మరో చిత్రం విరాటపర్వం సెట్స్ పై ఉండగా.. ఇంకో రెండు ప్రాజెక్టులు చర్చల దశలోనే ఉన్నాయి. ఇదిలా ఉండగానే రవితేజతో కలిసి నటించేందుకు సిద్ధమవుతున్నాడు రానా. 

 

మళయాళంలో విజయవంతమైన అయ్యప్పనుమ్ కోశియమ్  అనే చిత్రాన్ని, సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ తెలుగులో రీమేక్ చేయబోతోంది. పృథ్వీరాజ్, బిజూ మీనన్ కలిసి నటించిన ఈ సినిమాలో.. పృథ్వీరాజ్ పాత్రలో రవితేజ కనిపించనున్నారు.

 

ఈ క్రేజీ సినిమాకు సుధీర్ వర్మ దర్శకత్వం వహించనున్నాడని సమాచారం. త్వరలోనే అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ చేసి.. ఆగస్ట్ లో షూటింగ్ మొదలు పెట్టేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. మరి ఈ ఇద్దరి కాంబినేషన్ ఎలా ఉంటుందో చూడాలి. 

 

మొత్తానికి టాలీవుడ్ లో మల్టీస్టారర్ హడావిడి నడుస్తోంది. మంచి కథ దొరికితే చాలు అందులో నిమగ్నమయ్యేందుకు సిద్ధమంటున్నారు. అందులో భాగంగానే రానా, రవితేజ కాంబినేషన్ కు రంగం సిద్ధమవుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: