తమ హీరో సినిమా భారీ విజయాలు సాధించాలని కోరుకుంటారు అభిమానులు. సినిమాలో కిక్కెక్కించే అంశాలు ఉండాలని కోరుకోవడం సహజం.. ఆశిస్తారు కూడా. అటువంటి సన్నివేశాలు మెగాస్టార్ చిరంజీవి సినిమాల్లో కూడా కొన్ని ఉన్నాయి. ఆ సినిమానే ‘ఇంద్ర’. చిరంజీవి చేసిన ఒకే ఒక ఫ్యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమాలో ఫస్టాఫ్ లో చిరంజీవి మేనల్లుడిని షౌకత్ ఆలీఖాన్ కిడ్నాప్ చేసి తీసుకొస్తాడు. ముస్లిం అయిన తన కూతుర్ని హిందూ మతస్థుడు ప్రేమించడం తనకు నచ్చదు.
ఈ సమయంలో తన మేనల్లుడిని కట్టేసి కొట్టబోతే చిరంజీవి అడ్డుపడి తప్పు తనదేనంటూ కొట్టమంటాడు. ఆ సీన్ లో చిరంజీవిని కొట్టిన తర్వాత చిరంజీవి చెప్పిన డైలాగ్ సినిమాకే హైలైట్ అయింది. ‘తప్పు నావైపు ఉండిపోయింది కాబ్బటి తలొంచుకు వెళ్తున్నాను.. లేకపోతే ఇక్కడి నుంచి తలలు తీసుకెళ్లేవాడిని’ అంటూ చిరంజీవి చెప్పిన డైలాగ్ పేలిపోయింది. అభిమానుల ఈలలు గోలలతో ధియేటర్లను హోరెత్తించిన డైలాగ్ అది. నిజానికి అక్కడ చిరంజీవి నుంచి భారీ ఫైట్ ఆశిస్తారు సగటు ప్రేక్షకుడు. కానీ.. అక్కడ ఫైట్ లేకుండానే ఈ ఒక్క డైలాగ్ సినిమా రేంజ్ ను అమాంతం పెంచేస్తుంది.
చిరంజీవి పూర్తి రఫ్ లుక్ లో చెప్పిన ఆ డైలాగ్ తో అక్కడ ఫైట్ అవసరమన్న విషయాన్నే ప్రేక్షకులు మర్చిపోయారు. ఆ స్థాయిలో అక్కడ సన్నివేశం పండింది. సినిమా సాధించిన ఇండస్ట్రీ హిట్ లో ఈ సన్నివేశానికి చాలా భాగం ఉంది. సెకండాఫ్ లో ‘మొక్కే కదా అని పీకేస్తే.. పీక కోస్తా’ అనే డైలాగ్, సన్నివేశం కూడా సినిమా విజయంలో కీలకపాత్ర పోషించింది. సెకండాఫ్ లో వచ్చే ఈ డైలాగ్ కూడా ప్రేక్షకుల్ని అటెన్షన్ కి గురి చేస్తుంది. సినిమా విజయాల స్థాయి మార్చేయాలంటే ఇటువంటి సన్నివేశాలు తప్పనిసరి.