దెయ్యాలు.. భూతాలనే నమ్ముకున్న రవిబాబుకు ఎదురుదెబ్బ తగిలింది. అనసూయతో జనాలను భయపెట్టి బాక్సాఫీస్ ను మెప్పించినా.. ఆ తర్వాత వచ్చిన ఈ తరహా సినిమాలు రవిబాబునే భయపెట్టాయి. దీంతో ఛేంజ్ ఓవర్ కోసం.. ఈ సారి అడల్ట్ కాంటెస్ట్ పై పడ్డాడు. ప్రతి విషయంలోనూ కరోనాను వాడుకుంటూ.. క్రష్ సినిమాతో ముందుకొస్తున్నాడు.
దర్శకుడిగా రవిబాబుకు సక్సెస్ పర్సంటేంజ్ తక్కువే అయినా.. అల్లరి.. అనసూయ.. నచ్చావులే.. నువ్విలా లాంటి హిట్స్ తో తనకంటూ ఓ క్రేజ్ తెచ్చుకున్నాడు. అదుగో అంటూ.. ఆ మధ్య పంది పిల్లతో చేసిన ప్రయోగం బెడిసికొట్టింది. దీంతో తనదైన హారర్ స్టైల్లో ఆవిరి తీస్తే.. ఆశలు ఆవిరైపోయాయి.
ఆవిరి డిజాస్టర్ తర్వాత రవిబాబు క్రష్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. సినిమా పోస్టర్స్ చూస్తుంటే.. ఇదొక ఎ సర్టిఫికేట్ కు ఎక్కువే అనిపిస్తోంది. కరోనా పరిస్థితులను వాడుకుంటూ.. హీరోలందరికీ మాస్క్ లు వేసేశాడు. లేటెస్ట్ గా రిలీజైన అన్ లాక్ 1.0 పోస్టర్ చూస్తుంటే మరోసారి తనదైన మాస్క్ మార్క్ తో ఆకట్టుకున్నాడు. ముగ్గురు అబ్బాయిలు మాస్క్ లు ధరించి బాత్ రూమ్ లో అమ్మాయిని దొంగచాటుగా చూస్తారు. జాగ్రత్తగా ఉండండి. మాస్క్ పెట్టుకోండి సేఫ్ గా ఉండండని సలహా ఇప్పించాడు రవిబాబు.
గత కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేని రవిబాబు తాజాగా.. క్రష్ తో హిట్ ట్రాక్ ఎక్కుతాడా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. సినిమాను ఫ్లయింగ్ ఫాగ్స్ పతాకంపై రవిబాబు నిర్మిస్తున్నాడు. దర్శకుడు ఆ మధ్య సూపర్ మార్కెట్ కు వెళ్లి సెక్యూరిటీకి జ్వరముందో లేదో టెస్ట్ చేసి లోపలకు వెళ్లిన వీడియో వైరల్ అయింది. ఇలాంటిదే ఏదైనా చేసి.. క్రష్ తో ఇంప్రెస్ చేస్తాడో లేదో మరి. చూద్దాం.. రవిబాబు ప్లాన్ ఏ విధంగా వర్కవుట్ అవుతుందో చూడాలి.