తమిళంలో మంచి క్రేజ్ ఉన్న నటి వరలక్ష్మీ శరత్ కుమార్. స్టార్ హీరో శరత్ కుమార్ గారాలపట్టీ అయిన ఈ భామ తమిళ్ లో పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. విజయ్ హీరోగా వచ్చిన సర్కార్ లో ఈమె విలన్ గా నటించి మెప్పించింది. తెలుగులో సందీప్ కిషన్ హీరోగా వచ్చిన తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్ సినిమాలో కూడా నెగటివ్ రోల్ పోషించింది. ప్రస్తుతం రవితేజ హీరోగా వస్తున్న క్రాక్ లో కూడా వరలక్ష్మీ నటిస్తోంది. అయితే ఇప్పుడీ సినిమాలో వరలక్ష్మీ పాత్రపై ఓ వార్త ఇండస్ట్రీలో రౌండ్ అవుతోంది.
క్రాక్ లో రవితేజకు హీరోయిన్ గా శ్రుతిహాసన్ నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది. ఈ సినిమాలో వరలక్ష్మీ శరత్ కుమార్ లేడీ విలన్ పాత్ర చేస్తోందని నిన్న మొన్నటి వరకూ వార్తలు వచ్చాయి. అయితే.. ఆమె లేడీ విలన్ గా కాదని సినిమాలో నెగటివ్ షేడ్ లోనే ఉంటూనే సెకండ్ హీరోయిన్ పాత్ర చేస్తోందని అంటున్నారు. సినిమాలో రవితేజతో వరలక్ష్మికి డ్యూయెట్ కూడా ఉంటుందని అంటున్నారు. ప్రస్తుతం ఈ వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. వరలక్ష్మీ హీరోయిన్ గా తమిళ్ లో విశాల్ తో సినిమా చేసింది.
ఈమధ్య హీరోయిన్ గా చేయడం మానేసింది. కానీ.. తెలుగులో క్రాక్ లో హీరోయిన్ గా చేస్తోందనే వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతుందో యూనిట్ నుంచి అఫిషియల్ న్యూస్ రివీల్ కావాల్సి ఉంది. ఠాగూర్ మధు నిర్మిస్తున్న ఈ సినిమాకు గోపీచంద్ మలినేని దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే వీరిద్దరి కాంబినేషన్ లో డాన్ శీను, బలుపు సినిమాలు వచ్చాయి. రెండూ హిట్టయ్యాయి. దీంతో ఈ సినిమాపై అంచనాలు ఎక్కువగానే ఉన్నాయి.