తమిళ స్టార్ హీరో ఇళయదళపతి విజయ్ హీరోగా ప్రస్తుతం లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో మాస్టర్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు ఒక సాంగ్ కూడా మంచి రెస్పాన్స్ సాధించడంచి సినిమాపై బాగా అంచనాలు క్రియేట్ చేసింది. నేడు విజయ్ పుట్టినరోజు సందర్భంగా మాస్టర్ నుండి మరొక లేటెస్ట్ పోస్టర్ ని సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. ఇకపోతే మాస్టర్ అనంతరం అతి త్వరలో మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ ఒక సినిమా చేయనున్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన సూపర్ హిట్ సినిమా తుపాకీ కి సీక్వెల్ గా తెరకెక్కనున్న ఈ సినిమాను కూడా అదే రేంజ్ లో సక్సెస్ సాధించేలా ఎంతో పక్కాగా స్క్రిప్ట్ ని సిద్ధం చేస్తున్నారట దర్శకుడు మురుగదాస్.
వాస్తవానికి ఇటీవల విజయ్, మురుగదాస్ కాంబోలో వచ్చిన సర్కార్ సినిమా మంచి సక్సెస్ ని అందుకోవడంతో తుపాకీ 2 కి తమిళ ప్రేక్షకులతో పాటు విజయ్ ఫ్యాన్స్ లో కూడా భారీ స్థాయిలో అంచనాలు నెలకొని ఉన్నాయి. అలానే తుపాకీ సినిమా ఇటు తెలుగులో కూడా మంచి విజయం సాధించడం జరిగింది. కాగా ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతికనిపుణులు ఎంపిక ఇప్పటికే ప్రారంభం అయినట్లు తెలుస్తోంది. అయితే లేటెస్ట్ గా కొన్ని కోలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న ఎంపికయినట్లు చెప్తున్నారు. ముందుగా ఈ సినిమాలో మరొక స్టార్ హీరోయిన్ ని తీసుకోవాలని భావించినప్పటికీ, ఆమెకు ప్రస్తుతం చేతిలో చాలా సినిమాలు ఉండడంతో, ఆమె స్థానంలో సినిమా యూనిట్ రష్మికకు ఓటేసిందట.
ఈ విషయమై దర్శకుడు మురుగదాస్, రష్మికను సంప్రదించగా ఆమె వెంటనే ఒప్పుకున్నట్లు చెప్తున్నారు. ఇటీవల సూపర్ స్టార్ మహేష్ సరసన సరిలేరు నీకెవ్వరు, నితిన్ సరసన భీష్మ సినిమాల్లో నటించి రెండు సూపర్ హిట్స్ అందుకున్న రష్మిక, ప్రస్తుతం తెలుగులో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ సరసన పుష్ప, కన్నడలో పొగరు, తమిళ్ లో సుల్తాన్ సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ప్రస్తుతం కోలీవుడ్ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్త కనుక నిజమైతే మాత్రం రష్మిక రొట్టెవిరిగి నేతిలో పడ్డట్లే ....!!