2011 ఏప్రిల్ 22 వ తేదీన విడుదలైన రంగం మూవీ రాజకీయం, తీవ్రవాదం నేపథ్యంలో తెరకెక్కింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్ సినిమాలో తమిళ యాక్టర్ జీవ, కార్తీక నాయర్, అజ్మల్ అమీర్ ప్రధాన పాత్రలలో నటించారు. గతంలో చాలా కాలం ఫోటోగ్రాఫర్ గా పనిచేసిన కేవీ ఆనంద్ రంగం సినిమా కి కథ అందించి తానే దర్శకత్వం కూడా వహించాడు. ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను నిజ జీవిత సంఘటనల ఆధారంగా తీసుకొని తెరపై చూపించాడు కె.వి.ఆనంద్.
సినిమా కథ గురించి తెలుసుకుంటే ఫోటోగ్రాఫర్ గా పనిచేసే అశ్వద్ధామ/ అశ్వత్(జీవ) నేటి వార్త అనే పేపర్ సంస్థలో ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తుంటాడు. స్థానిక బ్యాంకును దోచుకుంటున్న నక్సలైట్లను ఛేదించి మరీ వారి ఫోటోలను తీస్తాడు అశ్వద్ధామ. అయితే తాను మారువేషంలో నక్సలైట్ గ్యాంగ్ లో చేరిపోయి వారి ఫోటోలు తీస్తుండగా రేణుక అతడిని నిజంగానే దొంగా అని భావించి పట్టుకుంటుంది. అనంతరం ఆ రేణుక నేటి వార్తా పేపర్ లో ఆర్టికల్ ఎడిటర్ గా పని చేస్తుందని తెలుస్తుంది. ఆ విధంగా వీళ్ళిద్దరికీ పరిచయం ఏర్పడుతుంది. అశ్వత్ చదువుకునే రోజుల్లో అతడికి వసంత్ అనే ఒక స్నేహితుడు ఉంటాడు. అతను రాజకీయరంగ ప్రవేశం చేసి నవతరం పార్టీని స్థాపిస్తాడు. తన స్నేహితుడు ఎన్నికలలో పోటీ చేస్తున్నాడని తెలిసిన అశ్వత్ తన నేటి వార్త సహోద్యోగుల, ముఖ్యంగా రేణుక, సహాయంతో ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న యోగి( ప్రకాష్ రాజ్), ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్న కోటశ్రీనివాసరావు చేసే అక్రమాలను, అన్యాయాలను బయట పెట్టి వసంత్ ఎన్నికలలో గెలిచేందుకు సహాయపడుతుంటాడు.
ఈ క్రమంలోనే వసంత్ నిర్వహించిన పార్టీ సభలో బాంబుపేలగా అశ్వత్ తన స్నేహితుడు వసంతని కాపాడతాడు కానీ తన వార్తాపత్రిక కంపెనీలో పనిచేసే సరూ ని కాపాడలేక పోతాడు. ఆమె ఎలా చనిపోయిందో తాను సీసీ కెమెరాలని పరిశీలించి అసలైన నిజమేంటో తెలుసుకుంటాడు. ఈ సన్నివేశం నుండి చివరి వరకు సినిమా చాలా థ్రిల్లింగ్ గా నడుస్తుంది అని చెప్పుకోవచ్చు. జీవ, అజ్మల్ అమీర్, కోట శ్రీనివాసరావు, ప్రకాష్ రాజ్, కార్తీక చాలా అద్భుతంగా నటించి ప్రేక్షకుల మనసులను దోచుకున్నారు. పొలిటికల్ థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన రంగం ప్రేక్షకులను ఫిదా చేసింది అని నిస్సందేహంగా చెప్పుకోవచ్చు.