దర్శకుడు రాజమౌళి తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి ఖండాలు దాటి అన్ని దేశాలకు బాహుబలి సినిమా తో సుపరిచితుడు అయిపోయాడు. ఇప్పుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇద్దరు యంగ్ హీరోలతో తెరకెక్కిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రం కోసం ప్రేక్షకులు ఎంతో ఎదురు చూస్తున్నారు. లాక్ డౌన్ నేపథ్యంలో సినిమా షూటింగులు నిలిచిపోయాయి. అందరిలాగానే ఈ సినిమా కూడా నిలిచిపోయింది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా వీడియో రిలీజ్ చేసి సినిమా మీద ఊహలను ఇంకా పెంచేశారు. సినిమా షూటింగ్ లకు తెలంగాణ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చిన తర్వాత సినిమా ప్రేమికులు అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా అభిమానుల్లో కొంత మేరకు భయం కూడా ఉంది. రాజమౌళి ఏ సినిమా తెరకెక్కించిన చాలా నెమ్మదిగా చేస్తారు. ఈ సినిమా కూడా ఆలస్యం చేస్తారా అనే వాదన వినిపిస్తోంది. దానికి తోడుగా ఈ లాక్ డౌన్ వలన ఇంకా ఇబ్బంది పెరిగింది.
ప్రతిష్టాత్మక చిత్రం 'ఆర్.ఆర్.ఆర్' త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. టెస్ట్ షూట్ కోసం ఏర్పాట్లు షురూ అయ్యాయి. భద్రతా ప్రమాణాల్ని పాటిస్తూ ఈ వారంలోనే దానిని నిర్వహించబోతున్నట్టు సమాచారం. వచ్చే నెల ఆరంభం నుంచి కథానాయకులు ఎన్టీఆర్, రామ్ చరణ్ సెట్లోకి దిగే అవకాశాలున్నాయి. అగ్ర దర్శకుడు రాజమౌళి తీస్తున్న సినిమా ఇది. డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.
లాక్ డౌన్ తర్వాత చిత్రీకరణలకు అనుమతులు ఇచ్చిన వెంటనే, ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లాలనుకున్నారు దర్శకుడు రాజమౌళి. త్వరలోనే టెస్ట్ షూట్ తో సాధ్యాసాధ్యాల్ని పరిశీలించి పనుల్ని వేగవంతం చేయనున్నట్టు తెలిసింది. బాలీవుడ్ తారలు అజయ్ దేవగణ్, అలియాభట్ తో పాటు శ్రియ తదితరులు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వచ్చే వేసవికి ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి.