జయలలిత బయోపిక్ ఆధారంగా.. తలైవి అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న తలైవి ఓటీటీ రైట్స్ రేటు భారీగా పలికిందట.
ఓ విధంగా చెప్పాలంటే.. కరోనా కారణంగా ప్రస్తుతం ఓటీటీల హవా నడుస్తోందని చెప్పొచ్చు. థియేటర్లు తెరవడానికి చాలా సమయం పట్టనుంది. తెరిచి జనాలు వస్తారో లేదో అనే భయం.. దాంతో ప్రస్తుతం చిన్న సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు నిర్మాతలు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ సైతం అందుకు పోటీ పడుతున్నాయి.
అలాగే సినిమా రిలీజ్ అయ్యాక.. ఓటీటీ రైట్స్ కోసం భారీ ఆఫర్ ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగా బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ నటిస్తున్న జయలలిత బయోపిక్.. తలైవి సినిమా ఓటీటీ రైట్స్ బాగా అమ్ముడు పోయాయట. ఆ విషయాన్ని కంగనానే ఓ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఐదు భాషలలో రూపొందుతున్న ఈ సినిమా హక్కులను దాదాపు 55కోట్లకు అమెజాన్. నెట్ ఫ్లిక్స్ రెండు తీసుకున్నాయని తెలిపింది. అయితే ఈ సినిమాను ముందుగా థియేటర్లలో రిలీజ్ చేశాకే.. ఓటీటీల్లో విడుదల చేయబోతున్నారట.
ఇక హీరోయిన్ గా.. రాజకీయ నాయకురాలిగా.. చెరగని ముద్ర వేసిన జయలలిత.. బయోపిక్ దర్శకుడు ఏఎల్ విజయ్ తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. జయలలిత జీవితంలో జరిగిన చాలా విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నారట. జయలలిత బయోపిక్ కావడం.. కంగనా రనౌత్ నటిస్తుండటంతో.. తలైవి సినిమాను ఓటీటీ ప్లాట్ ఫామ్స్ భారీ రేట్ ఇచ్చి మరీ తీసుకున్నాయని తెలుస్తోంది. జయలలిత అనగానే తమిళనాట మంచి క్రేజ్ ఉంది. తమిళ ప్రజలే తన బిడ్డలుగా.. అమ్మ పేరుతో ఎన్నో సంక్షేమ పథకాలను చేపట్టి అందరికీ దగ్గరయ్యారు. ఆమె లేని లోటును ఇప్పటికీ ఎవరూ పూడ్చలేని స్థితి అక్కడ నెలకొంది. అయితే ఆమె సినీనటిగా.. రాజకీయ నాయకురాలిగా ఎదిగిన తీరు బయోపిక్ రూపంలో రాబోతోంది. దీనిపై ప్రజల్లో ఎంతో ఆసక్తి నెలకొంది.