బాలీవుడ్ లో మదర్ ఆఫ్ డ్యాన్స్ గా పేరొందిన ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్ ఖాన్ కన్నుమూశారు. నాలుగు దశాబ్దాల సుదీర్ఘ కెరీర్ లో 2 వేలకు పైగా పాటలకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. శ్రీదేవి నుంచి కరీనాకపూర్ ఎంతోమంది హీరోయిన్లకు తన స్టెప్పులతో స్టార్ స్టేటస్ తెచ్చిపెట్టారు.
బాలీవుడ్ మదర్ ఆఫ్ డాన్స్ సరోజ్ ఖాన్.. శ్వాసకోశ సంబంధిత సమస్యలతో బాధ పడుతూ ముంబయిలో కన్నుమూశారు. బాలీవుడ్‌లో రెండు వేలకు పైగా పాటలకు ఆమె కొరియోగ్రఫీ చేశారు. శ్రీదేవి, మాధూరి దీక్షిత్ వంటి హీరోయిన్లు మంచి డ్యాన్సర్లుగా గుర్తింపు తెచ్చుకున్నారంటే.. వారి వెనకుంది సరోజ్‌ఖాన్ అని చెప్పడంలో సందేహం లేదు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా.. గ్రూప్ డ్యాన్సర్‌గా కెరీర్ ప్రారంభించిన సరోజ్ ఖాన్.. బాలీవుడ్ లో గొప్ప కొరియోగ్రాఫర్ గా ఎదిగారు.
సరోజ్‌ఖాన్ 1948 నవంబర్ 20న ముంబయిలో జన్మించారు. ఆమె తల్లిదండ్రులు దేశ విభజన సమయంలో పాకిస్థాన్ నుంచి భారత్‌కు వచ్చారు. చిన్నతనంలోనే డ్యాన్స్‌పై ఆసక్తి పెంచుకున్న సరోజ్ ఖాన్ గోడలపై తన నీడను చూస్తూ డ్యాన్స్ నేర్చుకున్నారు.1950వ దశకంలో సరోజ్ చైల్డ్ ఆర్టిస్ట్‌గా బాలీవుడ్ కెరీర్‌ను ప్రారంభించారు. 1958లో వచ్చిన హౌరాబ్రిడ్జ్ చిత్రంలోని ఆయియే మెహర్‌బాన్ పాటతో సరోజ్‌ఖాన్ గ్రూప్ డాన్సర్‌గా మారారు. అయితే సరోజాఖాన్ డాన్స్‌ను గమనించిన కొరియోగ్రాఫర్ సోహన్‌లాల్ ఆమెను తన సహాయకురాలిగా నియమించుకున్నారు.
అసిస్టెంట్ కొరియాగ్రాఫర్‌గా కొనసాగుతున్న సరోజ్ ఖాన్.. 1974లో వచ్చిన గీతా మేరా నామ్ సినిమాతో కొరియోగ్రాఫర్ గా మారారు. ప్రముఖ దర్శకులు సుభాష్ ఘాయ్ తెరకెక్కించిన విధాత సినిమా తర్వాత ఆమెకు వెనక్కితిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. శ్రీదేవిని స్టార్ ని చేసిన మిస్టర్ ఇండియా, నగీనా, చాంద్‌నీ వంటి సినిమాలకు సరోజ్‌ఖాన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేశారు. మాధురీ దీక్షిత్‌కు పేరు తెచ్చిపెట్టిన తేజాబ్ సినిమాలో ఏక్ దో తీన్ సాంగ్, బేటా సినిమాలో ధక్ ధక్ కర్నే సాంగ్ కు సరోజ్ ఖాన్ కొరియోగ్రఫీ చేశారు. ఈ పాటలతోనే మాధురి డ్యాన్సింగ్ క్వీన్ గా పేరు తెచ్చుకున్నారు.
ఐశ్వర్యారాయ్ కు బాలీవుడ్ లో స్టార్ స్టేటస్ తీసుకొచ్చిన హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమాకు కూడా సరోజ్ ఖాన్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించారు. ఆ సినిమాలో నింబుడ నింబుడ సాంగ్ అప్పట్లో దేశవ్యాప్తంగా సెన్సేషనైంది. బాలీవుడ్‌లో విజయవంతమైన కొరియోగ్రాఫర్‌గా ఉన్న సరోజ్ ఖాన్ కు.. 8 ఫిల్మ్‌ఫేర్ అవార్డులు, మూడు జాతీయ అవార్డులు వచ్చాయి. మెగాస్టార్ చిరంజీవి నటించిన చూడాలని వుంది సినిమాలో ఓ మారియా పాటకు ఉత్తమ కొరియోగ్రాఫర్ గా నంది అవార్డు తీసుకున్నారు సరోజ్ ఖాన్.
ఎన్నో విజయవంతమైన పాటల్ని అందించిన సరోజ్ ఖాన్.. ఆ క్రెడిట్ తన ఒక్కరిదే అంటే ఎప్పుడూ ఒప్పుకోలేదు. తన స్టెప్పుల్ని తెరపై అద్భుతంగా ప్రదర్శించిన శ్రీదేవి, మాధురిదీక్షిత్, ఐశ్వర్యారాయ్, రాణి ముఖర్జీ, కరీనాకపూర్ కు కూడా ఆ క్రెడిట్ లో భాగముందని చెబుతారు. వైజయంతీమాల తన స్టెప్ చూసి ప్రశంసించడం.. ఎప్పటికీ మర్చిపోలేని తీపి గుర్తని చెబుతారు సరోజ్ ఖాన్. డ్యాన్స్ కారణంగా మెదడు చురుగ్గా ఉంటుందని, ఆరోగ్య సమస్యలు రావని చెప్పేవారు సరోజ్ ఖాన్.