కొన్ని పాటల్లో సంగీతం వినిపిస్తే.. సాహిత్యం వినిపించదు.. సాహిత్యం వినిపిస్తే, సంగీతం బాగుండదు. ఈ రెండూ కావాలంటే కీరవాణి సంగీతం వినాలి. తెలుగు సినిమా సంగీతంలో తనకంటూ ఓ స్టైల్, ఓ ట్రెండ్ క్రియేట్ చేసుకున్నారు ఎమ్.ఎమ్.కీరవాణి. మ్యూజిక్ డైరెక్టర్ గా కీరవాణికి ఇది 30వ బర్త్ డే. సరిగ్గా 30ఏళ్ల క్రితం ఆయన మ్యూజిక్ అందించిన మనసు మమత సినిమా రిలీజైంది. సినీ పరిశ్రమలోకి ఎంతోమంది మ్యూజిక్ డైరెక్టర్లు వస్తుంటారు.. పోతుంటారు. కానీ 30ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న హిట్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి.
నడుస్తున్న ట్రెండ్ కు భిన్నంగా వెళ్లడం కీరవాణి స్పెషల్. ఫోక్ అయినా.. వెస్ట్రన్ అయినా.. మింగుడుపడని రాక్ అయినా.. కీరవాణికి అన్నీ కొట్టిన పిండి. తెలుగు ఇండస్ట్రీలో డివోషనల్ ఫస్ట్ గుర్తొచ్చే పేరు కీరవాణి. ఇప్పటికీ భక్తిరస చిత్రాలు తీయాలన్నా.. సంగీత ప్రాధాన్యం కలిగిన సినిమాలు చేయాలన్నా దానికి కీరవాణే మ్యూజిక్ అందిస్తారు. బెస్ట్ కంపోజర్ మాత్రమే కాదు.. కీరవాణి మంచి సింగర్ కూడా. స్వీయ సంగీత సారథ్యంలో ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ ఆలపించాడు కీరవాణి.
కీరవాణి పేరు చెప్పగానే.. రాఘవేంద్రరావు గుర్తుకొస్తారు. రాఘవేంద్ర రావు పేరు చెప్పగానే కీరవాణి గుర్తుకువస్తారు. వీళ్లిద్దరి మధ్య ఉన్న అనుబంధం విడదీయరానిది. రాఘవేంద్రరావు పిక్చరైజేషన్ కు కీరవాణి మ్యూజిక్ పర్ ఫెక్ట్ గా సింక్ అవుతుంది. బాణీలు వాటంతట అవే పుట్టుకొస్తాయి. ఫైనల్ గా ప్రేక్షకులకు ఓ అద్భుతమైన పాట అందుతుంది. కీరవాణి అన్ని రకాల ట్యూన్స్ అందించగలడని నిరూపించారు రాఘవేంద్రరావు. బొంబాయి ప్రియుడు, పెళ్లి సందడి సినిమాలకు అద్భుతమైన మెలోడీలు ఇచ్చిన కీరవాణితోనే.. ఘరానామొగుడు సినిమాకు మాస్ బీట్స్ రాబట్టుకోగలిగారు.
ఇండస్ట్రీలో ఎంతమంది మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నా.. డివోషనల్ మూవీస్ కు సంగీతం అందించాలంటే కీరవాణి కావాలి. అన్నమయ్య నుంచి నాగార్జున షిరిడి సాయి వరకు ఏ భక్తిరస సినిమాకైనా.. సంగీత దర్శకుడు కీరవాణే. అన్నమయ్య తర్వాత రాఘవేంద్రరావు-కీరవాణి కాంబినేషన్ లో వచ్చి శ్రీరామదాసు సినిమాలో అన్ని పాటలు హిట్టే. రాఘవేంద్ర రావు మాదిరి రాజమౌళితో కీరవాణిది సూపర్ హిట్ కాంబినేషనే. స్టూడెంట్ నెం.1తో మొదలైన ఈ బంధం.. హిట్.. సూపర్ హిట్.. బ్లాక్ బస్టర్.. రికార్డులు బ్రేక్ చేసే వరకు వెళ్లింది. ప్రస్తుతం ఈ కలయికలో ఆర్ఆర్ఆర్ రూపొందుతోంది.