సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ లో క్రేజీ సినిమాలు చేసిన నిర్మాత ఎం.ఎస్.రాజు. వెంకటేష్ తో శత్రువు సినిమాతో నిర్మాణ సంస్థను మొదలుపెట్టిన ఎమ్మెస్ రాజు. మహేష్ తో ఒక్కడు, ప్రభాస్ తో వర్షం, పౌర్ణమి. యువ హీరోలు ఉదయ్ కిరణ్ తో మనసంతా నువ్వే, నీ స్నేహం. సిద్ధార్థ్ తో నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలు చేశారు. అప్పట్లో ఎమ్మెస్ రాజు సినిమా అంటే సూపర్ హిట్ పక్కా అనే టాక్ ఉండేది. నిర్మాతగా భారీ సినిమాలు చేసిన ఎమ్మెస్ రాజు మస్కా తర్వాత నిర్మాతగా వెనుకపడ్డాడు.
నిర్మాతగా సినిమాలు తీయడం మానేసి డైరక్టర్ గా కొత్త టర్న్ తీసుకున్న ఎం.ఎస్ రాజు వాన సినిమాను డైరెక్ట్ చేశారు. ఆ తర్వాత మళ్లీ తన తనయుడు హీరోగా తునీగ తునీగ సినిమా చేశాడు. ఇక ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని డర్టీ హరి సినిమా చేస్తున్నాడు. టైటిల్ తోనే ఇది ఎలాంటి సినిమా అనేది చెప్పొచ్చు. ఇక లేటెస్ట్ గా ఈ సినిమా ప్రచార చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సినిమా ప్రమోషన్స్ చూస్తుంటే ఎలాంటి క్వాలిటీ సినిమాలు తీసే ఎం.ఎస్ రాజు ఇలాంటి అడల్ట్ సినిమా చేస్తున్నాడాని అనుకుంటున్నారు.
అయితే ఎలాంటి సినిమా చేసినా ఓవరాల్ గా ఆడియెన్స్ కు నచ్చితేనే అది హిట్. జానర్ ఏదైనా.. బడ్జెట్ ఎంతైనా సరే ప్రేక్షకులను మెప్పించే అంశాలు ఉంటేనే చూస్తారు. ఇక ఇప్పటి యూత్ ఆడియెన్స్ ను టార్గెట్ చేస్తూ ఎం.ఎస్ రాజు డర్టీ హరి సినిమా చేస్తున్నాడు. శ్రవణ్ రెడ్డి, రుహాని శర్మ జంటగా నటిస్తున్న ఈ సినిమాతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తునారు ఎం.ఎస్ రాజు. ఆయన నిర్మాతగా ఉన్నప్పుడే క్వాలిటీ సినిమాలు చేసిన ఎమ్మెస్ రాజు డైరక్టర్ గా కాంప్రమైజ్ అవక తప్పలేదు. ఈ సినిమాను సతీష్ బాబు, సాయి పునీత్ నిర్మిస్తున్నారు.