హీరోలందరూ బిజినెస్ మేన్ లే. రూపాయి సంపాదించే చోట రెండు రూపాయలు రాబట్టడం వీళ్లకు బాగా తెలిసిపోయింది. హీరోగా నటిస్తే.. 20.. 30 కోట్లు మాత్రమే పారితోషికం ముడుతోంది. అదే నిర్మాతగా మారితే.. దీనికి డబుల్ ఇన్ కమ్ వస్తోంది. దీంతో మన స్టార్స్ అందరూ నిర్మాతలుగా మారిపోయారు.
మహేశ్ బాబుకు సూపర్ స్టార్ కృష్ణ స్థాపించిన పద్మాలయా స్టూడియోస్ బేనర్ ఉంది. అయితే సొంతంగా జిఎంబి ఎంటర్ టైన్ మెంట్ పేరుతో బేనర్ నెలకొల్పి శ్రీమంతుడు నిర్మించిన మైత్రీ మూవీస్ తో భాగస్వామిగా వ్యవహరించాడు. తొలి ప్రయత్నం సక్సెస్ కావడంతో.. ఆ తర్వాత మహేశ్ నటించిన ప్రతి సినిమాలోనూ బేనర్ మార్క్ కనిపించింది. సరిలేరు నీకెవ్వరు నాన్ థియేటరికల్ రైట్స్ తీసుకున్నాడు. దీని విలువ 50కోట్లు అని సమాచారం.
మెగా ఫ్యామిలీలో గీతా ఆర్ట్స్.. అంజన ప్రొడక్షన్స్.. పవన్ క్రియేటివ్ వర్క్స్ ఉన్నా.. తనకంటూ సొంత బేనర్ కావాలనుకున్నాడు రామ్ చరణ్. ఈ క్రమంలో ఇంటి పేరునే బేనర్ కు పెట్టి.. కొణిదెల ప్రొడక్షన్ పతాకంపై ఖైదీ నెంబర్ 150తీశాడు. సైరా కూడా ఇదే బేనర్ లో రూపొందింది. చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ లో కొణిదెల ప్రొడక్షన్స్ లో తప్ప మరో బేనర్ లో నటించలేదు. కొరటాల దర్శకత్వంలో నటిస్తున్న సినిమా కూడా ఇదే బేనర్ లో రూపొందుతోంది. రెమ్యునరేషన్ కు మించి ఆదాయం రావడంతో.. సొంత బేనర్ వైపు మొగ్గు చూపుతున్నాడు చిరంజీవి.
ఇక ప్రభాస్ కు సొంత బేనర్ లేదన్న లోటులేదు. ఎందుకంటే.. సోదరుడు, స్నేహితుడితో కలిసి స్థాపించిన యువి క్రియేషన్స్ ప్రభాస్ సొంత బేనరే. మిర్చితో మొదలైన ఈ బేనర్ సాహోను.. ప్రస్తుతం రాధే శ్యాం మూవీని నిర్మిస్తోంది. రాధే శ్యాం తర్వాత ప్రభాస్ వైజయంతీ మూవీస్ పతాకంపై నాగ అశ్విన్ దర్శకత్వంలో నటించనున్నాడు. ఆ తర్వాత బాలీవుడ్ డైరెక్టర్ తో కలిసి పనిచేయనున్నాడు ప్రభాస్. ఈ మూవీని కూడా యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఇలా సొంత బేనర్ కే ప్రిఫరెన్స్ ఇస్తూ.. కోట్లు గడిస్తున్నాడు ఈ పాన్ ఇండియా హీరో.
ఇక దగ్గుబాటి ఫ్యామిలీకి సురేష్ ప్రొడక్షన్స్.. అక్కినేని ఫ్యామిలీకి అన్నపూర్ణ స్టూడియో ఎలాగూ ఉన్నాయి. మెగా ఫ్యామిలీలో మూడు నాలుగు బేనర్స్ ఉన్నాయి. ఇలా అందరూ బిజినెస్ పరంగా ఎప్పుడో ఆలోచించగా.. నందమూరి ఫ్యామిలీ హీరోలు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. ఎన్టీఆర్ కు సొంత బేనర్ లేకపోయినా.. అనే కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ ను ఉపయోగించుకుంటూ జై లవకుశలో నటించాడు. అప్పటి వరకు హీరోగా తీసుకున్న రెమ్యునరేషన్ కంటే ఎక్కువ దక్కింది. ఎన్టీఆర్ కు ఓ బేనర్ లేకపోయినా.. ఎన్టీఆర్ ఆర్ట్స్ అలాంటిదే. ఆర్ఆర్ఆర్ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటించే సినిమాను హారిక హాసిని క్రియేషన్స్ తో పాటు.. ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి నిర్మిస్తోంది.
మహానటుడు ఎన్టీఆర్ స్థాపించిన బేనర్ రామకృష్ణ సినీ స్టూడియోస్ లో బాలకృష్ణ చాలా సినిమాల్లో నటించాడు. ఆ తర్వాత అన్న రామకృష్ణ నిర్మాతగా రామకృష్ణ హార్టికల్చర్ సినీ స్టూడియోస్ పతాకంపై పెద్దన్నయ్య మూవీలో నటించాడు. అయితే.. ఎన్టీఆర్ బయోపిక్ కోసం నిర్మాతగా మారాడు. ఎన్ బికె ఫిలింస్ స్థాపించిన కథానాయకుడు.. మహానాయకుడు నిర్మించాడు. ఈ బయోపిక్స్ నిరాశపరచడంతో.. బోయపాటితో తీద్దామనుకున్న సినిమాను రవీంద్రరెడ్డికి అప్పజెప్పాడు.