ముందుగా రామ్ హీరోగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో 2015లో వచ్చిన నేను శైలజ సినిమా ద్వారా టాలీవుడ్ కి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కీర్తి సురేష్. ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ అందుకున్న కీర్తి, తన ఆకట్టుకునే అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసింది. ఆ తరువాత నాచురల్ స్టార్ నాని సరసన నేను లోకల్ సినిమాలో హీరోయిన్ గా నటించి రెండవ సినిమాతో కూడా మరొక హిట్ కొట్టిన కీర్తి, ఆపై పవన్ కళ్యణ్ సరసన అజ్ఞాతవాసిలో నటించింది.
అనంతరం ఒకప్పటి టాలీవుడ్ అగ్ర నటి మహానటి సావిత్రి జీవిత గాథ ఆధారంగా నాగ అశ్విన్ తీసిన మహానటిలో సావిత్రి పాత్రలో నటించి, దానితో పెద్ద హిట్ అందుకోవడంతో పాటు, ఆ సినిమాలో తన నటనతో అందరి మనసులు గెలుచుకుంది. ఇక ఇటీవల ఆమె నటించిన పెంగ్విన్ సినిమా అమెజాన్ ఓటిటి ప్లాట్ ఫామ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి రెస్పాన్స్ ని దక్కించుకుంది. ఇకపోతే అతి త్వరలో ఆమె సూపర్ స్టార్ మహేష్ సరసన సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్ గా నటించనున్న విషయం తెలిసిందే. ఇటీవల ఆ విషయాన్ని స్వయంగా కీర్తి వెల్లడించింది. బ్యాంకు ఫ్రాడ్ ల నేపథ్యంలో మంచి మెసేజ్ తో పాటు పలు కమర్షియల్ హంగులతో దర్శకుడు పరశురామ్ ఈ సినిమాని తెరకెక్కించనున్నట్లు తెలుస్తోంది.
కాగా నేడు కొన్ని టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారాన్ని బట్టి ఈ సినిమాలో కీర్తి సురేష్ ఒక ప్రముఖ బ్యాంకు ఎంప్లాయ్ గా కనిపించనున్నట్లు టాక్. ఆమె ఉద్యోగం చేసే సమయంలో హీరోతో పరిచయం ఏర్పడి అది ప్రేమగా మారుతుందని, అలానే సినిమాలో కీర్తి పాత్ర ఎంతో ముఖ్యమైనదని అంటున్నారు. మరి ప్రస్తుతం విస్తృతంగా ప్రచారం అవుతున్న ఈ వార్తలో నిజానిజాలు ఎంతవరకు ఉన్నాయో తెలియదుగాని, ఒకవేళ ఇదే కనుక నిజం అయితే మాత్రం, మరొక మంచి పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ ని కీర్తి చేజిక్కించుకున్నట్లే......!!