సినిమా పరిశ్రమలో అరంగ్రేటం చేసిన సమయంలో మణిశర్మ కీరవాణి దగ్గర అసిస్టెంట్ గా జాయిన్ అయ్యారు. ఆ సమయంలోనే కీరవాణి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహిస్తున్న క్షణక్షణం మూవీకి సంగీత బాణీలు సమకూర్చారు. అప్పుడే మణిశర్మ కీబోర్డు వాయించడం చూసిన వర్మ ఇతనిలో కూడా ఏదో అద్భుతమైన టాలెంటు ఉంది. ఇతనిని కూడా మ్యూజిక్ డైరెక్టర్ ని చేయవచ్చు అని భావించాడట. ఒకానొక సమయంలో ఆర్జీవి చెన్నై వెళ్ళినప్పుడు మణిశర్మ ని కలుసుకుని ఏమయ్యా మణిశర్మ! నీకు ఒక సినిమా ఇస్తాను సంగీతదర్శకుడిగా చేస్తావా? అని అడిగాడట. అది వినగానే రామ్ గోపాల్ వర్మ తనని ఆటపట్టిస్తున్నాడని అనుకున్నాడట మణిశర్మ.


నిజానికి అప్పట్లో మ్యూజిక్ డైరెక్టర్ గా పని చేసేందుకు మణిశర్మ కి ఇష్టం ఉండకపోయేది. ఎందుకంటే అప్పట్లో సంగీత దర్శకుల వద్ద పనిచేసినందుకుగాను మణిశర్మ ఐదు వేల రూపాయల వేతనాన్ని తీసుకునేవారు. సినిమాకి సంగీతం మంచిగా వచ్చినా రాకపోయినా అతనికి సంబంధం లేకపోయేది. దీంతో అతడిపై ఒత్తిడి అంతగా ఉండకపోయేది. కానీ సంగీత దర్శకుడిగా పని చేస్తే తనపై భారం ఎక్కువ అవుతుందని ఒక్క సినిమాకి సంగీతం సరిగా సమకూర్చకపోయినా తన కెరియర్ పతనమవుతుందని మణిశర్మ భయపడే వారట. ఇది తెలుసుకున్న రామ్ గోపాల్ వర్మ మణిశర్మ ని రెచ్చగొట్టాలని అనుకున్నాడట. అందుకే తనకి తెలిసిన వారందరితో మణిశర్మ గురించి మాట్లాడుతూ మణిశర్మ కీబోర్డు వాయించడం రాదు అతనిలో ఏ టాలెంట్ లేదు అతనికి సంగీతమే రాదు అని చెప్పాడట.


ఈ విషయం కాస్త ఆ నోటా ఈ నోటా పడి చివరకు మణిశర్మ కి తెలిసింది. దీంతో మణిశర్మ నేరుగా రామ్ గోపాల్ వర్మ వద్దకు వెళ్లి నాకు కీబోర్డు వాయించడం రాదు అంటున్నారట. నాలో టాలెంట్ మీకు తెలియాలంటే ఏం చేయాలో చెప్పండి, కావాలంటే ఒక లిరిక్స్ ఇవ్వండి దాన్ని స్వరపరిచి చూపిస్తాను అని సీరియస్ ఛాలెంజ్ విసిరారట. దీంతో రాం గోపాల్ వర్మ ఒక పాటను ఇవ్వగానే మణిశర్మ ఆ పాట లిరిక్స్ కి తగ్గట్టుగా ట్యూన్ చేసి అతనికి వినిపించారట. ఇది బాగా నచ్చిన రామ్ గోపాల్ వర్మ మాట్లాడుతూ ఏమయ్యా మణిశర్మ నీలో ఎంతో మ్యూజిక్ టాలెంట్ ఉంది కానీ నువ్వు దానిని సోలో గా బయటకు తీసేందుకు భయపడుతున్నావు. నువ్వు సోలోగా కంపోజ్ చేసేందుకు భయపడుతున్నావు కాబట్టే నేను నిన్ను ఇలా రెచ్చగొట్టాల్సి వచ్చింది అని అన్నాడు. తాను
క్షణ క్షణం సినిమా తర్వాత ఒక హారర్ చిత్రం చేయాలనుకుంటున్నానని, ఆ సినిమాకి మిమ్మల్ని సంగీతదర్శకుడిగా పెట్టుకుంటున్నానని, మీరు ఇక ఏమీ మాట్లాడకు అని రామ్ గోపాల్ వర్మ మణి శర్మకు చెప్పాడు. దీంతో చేసేదేమీ లేక అతని సినిమాలో సంగీతాన్ని సమకూర్చేందుకు మణిశర్మ ఒప్పుకున్నాడు.


1990 లో ప్రారంభమైన రామ్ గోపాల్ వర్మ సినిమా 1992లో రాత్రి అనే పేరుతో విడుదల అయ్యింది. ఈ సినిమాతో మణిశర్మ మొట్టమొదటిగా సంగీత దర్శకుడిగా మారారు. రాత్రి సినిమా రాత్ పేరుతో హిందీలో డబ్ కాబడింది. అయితే ఈ హారర్ చిత్రం తెలుగులో హిందీలో డిజాస్టర్ అయ్యింది. దాంతో మణి శర్మ అతనికి అవకాశాలు రావని, అసిస్టెంట్ సంగీత దర్శకుడిగా కూడా ఎవరు పెట్టుకోరని ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే మళ్లీ కీబోర్డు ప్లేయర్ గా జాయిన్ అయ్యారు. అయితే 1992 వ సంవత్సరంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కించిన అంతం సినిమాలో మణిశర్మ మొట్టమొదటిగా సోలోగా స్వరపరిచిన చలెక్కి ఉందనుకో అనే పాటను పెట్టి మణిశర్మ ని కూడా సంగీత దర్శకుడిగా పేరు వేసాడు రాంగోపాల్ వర్మ.

Powered by Froala Editor

మరింత సమాచారం తెలుసుకోండి: