కరోనా వైరస్ దెబ్బతో సినిమా ధియేటర్లు మూతబడి మరోవారం రోజులలో నాలుగు నెలలు పూర్తి కావస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న పరిస్థితులు చూస్తుంటే మరో నాలుగు నెలల వరకు ధియేటర్లు తెరుచుకునే పరిస్థితిలేదు. ఒకవేళ సాహసించి ధియేటర్లు తెరిచినా జనం ధియేటర్లకు వస్తారన్న నమ్మకం ఎవరికీ కలగడంలేదు. ఇలాంటి పరిస్థితులలో ఇప్పుడు టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీలో రిలీజ్ కు రెడీగా ఉన్న సుమారు 10 సినిమాల పరిస్థితి అత్యంత దయనీయంగా ఉంది.
ఈమూవీలు అన్నీ నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు రెడీగా ఉన్న పరిస్థితులలో ఈమూవీల నిర్మాతల పై విపరీతంగా వడ్డీల భారం పడుతోందని ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈనేపథ్యంలో కొందరు ప్రొడ్యూసర్స్ ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ వైపు చూస్తున్నారు. వడ్డీల భారంతో పాటు రోజులు గడిచే కొద్దీ ఆ సినిమాల కంటెంట్ ఓల్డ్ అయిపోతుందేమో అనే ఆలోచనతో ఓటీటీలలో తమ సినిమాలు రిలీజ్ చేయడానికి తమవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.
అయితే బాలీవుడ్ సినిమాల విషయంలో మంచి రెట్లు ఇస్తున్న ప్రముఖ ఓటీటీ సంస్థలు తెలుగు సినిమాల విషయం వచ్చే సరికి విపరీతంగా బేరసారాలు ఆడుతున్నట్లు టాక్. దీనికికారణం ఇప్పటివరకు ఓటీటీ లలో రిలీజ్ అయిన తెలుగు సినిమాలకు ఓటీటీ సంస్థలు అంచనా వేసిన స్థాయిలో వ్యూస్ రావట్లేదని ఇక్కడ తెలుగు రాష్ట్రాలలో సబ్ స్క్రైబర్స్ కూడా పెరగట్లేదని ఓటీటీలు భావిస్తున్నాయట. అందుకనే తెలుగు సినిమాలకు భారీ మొత్తంలో చెల్లించడానికి వారు వెనకడుగులు వేస్తున్నారని తెలుస్తోంది.
దీనికితోడు ప్రస్తుత పరిస్థితులను అవకాశంగా తీసుకుని ఓటీటీ సంస్థలు ప్రొడ్యూసర్స్ తో డీల్స్ విషయంలో కండిషన్స్ పెడుతున్నారని అంటున్నారు. ఓటీటీలో విడుదలచేయబోయే సినిమాల ప్రొడ్యూసర్స్ కి డబ్బులు ఒకేసారి చెల్లించకుండా రెవెన్యూ షేరింగ్ పద్ధతిలో ఇస్తామని కొన్ని ప్రముఖ ఓటీటీ సంస్థలు చెపుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఒక్కప్రేక్షకులు ఓటీటీ లలో సినిమాలు చూసే గంటకి 75 పైసలు నుంచి 9 రూపాయల వరకు మాత్రమే ఇచ్చే విధంగా ఓటీటీలు తమ రూల్స్ పెడుతున్నాయని అంటున్నారు. ఇలాంటి కండిషన్స్ లో ఓటీటీ స్ట్రీమ్స్ లో సినిమాలు విడుదలచేయలేక సినిమా ధియేటర్స్ ఒపెన్ అయ్యేవరకు వేచి చూడలేక అనేకమంది పెద్ద నిర్మాతల నుండి చిన్ననిర్మాతల వరకు ప్రస్తుత పరిస్థితులలో అయోమయంలో రోజులు గడుపుతున్నారు అంటూ వార్తలు గుప్పుమంటున్నాయి..