![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/pawan-kalyan-thammudu-movie-completes-21-years7f16a6f2-0a95-44db-8777-cf108201915f-415x250.jpg)
యూత్ తమను తాము ఐడెంటిఫై చేసుకునే పాత్రలను రెండు దశాబ్దాల క్రితమే చేశాడు పవన్ కల్యాణ్. చిరంజీవి తమ్ముడిగా సినిమాల్లోకి ఎంటరైనా వరుస హిట్లతో భారీ ఫ్యాన్ బేస్ సాధించుకోవడానికి ఇదొక కారణం. అటువంటి సినిమాల లిస్టులో ‘తమ్ముడు’కు ప్రత్యేక స్థానం ఉంది. ‘తొలిప్రేమ’తో వచ్చిన క్రేజ్ ను మలి సినిమా ‘తమ్ముడు’తో నిలబెట్టుకుని మరింత పెంచుకున్నాడు. ఈ సినిమా విడుదలై నేటికి 21 ఏళ్లు పూర్తయ్యాయి. పి.ఏ. అరుణ్ ప్రసాద్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 1999 జూలై 15న విడుదలైంది.
అల్లరి స్టూడెంట్ గా, బాధ్యత లేకుండా తిరిగే కుర్రాడిగా, బాధ్యత తెలుసుకుని అనుకున్నది సాధించే యువకుడిగా.. మూడు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రల్లో పవన్ ఒదిగిపోయాడు. ఫ్రెండ్స్ తో కాలేజీ సరదాలు, ఇంటి దగ్గర అల్లరి, అమ్మాయిల చుట్టూ ప్రేమిస్తున్నానంటూ తిరగడం.. వంటి అంశాలు యూత్ కు, ఫ్యాన్స్ కు విపరీతంగా నచ్చేశాయి. పవన్ తన స్టైల్, మేనరిజమ్స్ తో వన్ మ్యాన్ షో చేశాడు. రమణ గోగుల సంగీతం సినిమాకు ప్లస్ పాయింట్. పాటలన్నీ చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. సినిమాలో పవన్ పాడిన జానపదాలు అలరించాయి.
అప్పటికి ఏడేళ్ల క్రితం హిందీలో వచ్చిన జోజీతా వహీ సికిందర్ సినిమాకు తమ్ముడు రీమేక్ గా తెరకెక్కింది. ఆ సినిమాలో సైకిల్ రైడింగ్ పోటీలు ఉంటే తమ్ముడులో కిక్ బాక్సింగ్ నేపథ్యం తీసుకున్నాడు. సినిమా విజయంలో కిక్ బాక్సింగ్ కీలకంగా మారింది. పవన్ రియల్ లైఫ్ లో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ను బేస్ చేసుకుని చేసిన పాట సినిమాకే హైలైట్. శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ ఫిలింస్ బ్యానర్ పై బూరుగుపల్లి శివరామకృష్ణ నిర్మించిన ‘తమ్ముడు’ 175 రోజులు రన్ అయి సిల్వర్ జూబ్లీ మూవీగా నిలిచింది.