టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్.. ఇలా సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో భారీ సక్సస్ లు అందుకున్న సినిమాలకి కొనసాగింపుగా సీక్వెల్ అంటూ సినిమాలను రూపొందిస్తున్నారు మేకర్స్. అన్ని భాషల్లో ఉన్న స్టార్ హీరోలందరూ ఆసక్తి చూపించడమే కాదు కొన్ని సార్లు ఆయా హీరోలే దర్శక, నిర్మాతలకి మనం ఈ సినిమాకి సీక్వెల్ చేసేద్దాం అని ముందే కమిటవుతున్నారు. ఇలా అనుకున్న సినిమాలకి సీక్వెల్స్ చాలానే రూపొందినప్పటికి అన్ని సినిమాలు హిట్ అవలేదు సరికదా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్ గాను నిలిచాయి.
బాలీవుడ్ లో సల్మాన్ ఖాన్ దబాంగ్ సినిమాలో నటించాడు. 2010 లో వచ్చిన ఈ సినిమా ద్వారా బాలీవుడ్ సీనియర్ నటుడు శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షి సిన్హా హీరోయిన్ గా హిందీ పరిశ్రమకి పరిచయమైంది. అప్పటి వరకు వచ్చిన పోలీస్ బ్యాగ్డ్రాప్ కథల కంటే దబాంగ్ కథ, కథనం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో సల్మాన్ ఖాన్ ఈ సినిమాకి వరసగా రెండు సీక్వెల్స్ ని తెర మీదకి తీసుకు వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు.
ఇక దబాంగ్ సినిమాని టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రీమేక్ చేయగా ఇక్కడ సంచలన విజయాన్ని అందుకోవడమే కాదు వసూళ్ళ పరంగా టాలీవుడ్ లో కొత్త రికార్డ్స్ ని క్రియోట్ చేసింది. అయితే ఆ తర్వాత సర్దార్ గబ్బర్ సింగ్ మాత్రం అనుకున్నంతగా సక్సస్ కాలేకపోయింది. ఇలా పోలీస్ బ్యాగ్డ్రాప్ తోనే కోలీవుడ్ లో దర్శకుడు హరి, స్టార్ హీరో సూర్య కాంబినేషన్ లో సింగం సిరీస్ వచ్చింది. ఈ సిరీస్ లో ఇప్పటి వరకు వచ్చిన మూడు భాగాలు తమిళ చిత్ర పరిశ్రమలో భారీ సక్సస్ ని అందుకున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ ఇద్దరి కాంబినేషన్ లో సింగం సిరీస్ లో నాలుగో భాగానికి దర్శకుడు స్క్రిప్ట్ సిద్దం చేస్తున్నట్టు సమాచారం.
అయితే సీక్వెల్ కథలను తయారు చేయడం మేకర్స్ కి కొంత వరకు సులభం అయినప్పటికి ప్రేక్షకులను మెప్పించడం మాత్రం దర్శక, నిర్మాతలకే కాదు హీరోలకి కొన్ని సార్లు పెద్ద ఛాలెంజ్ గా మారుతుంది. పొరపాటున మొదటి భాగానికి కొనసాగింపుగా వచ్చిన సినిమా గనక ఫ్లాపయితే మిగతా దర్శకులు, హీరోలు సీక్వెల్స్ కి ధైర్యం చేయలేరు. అందుకు ఉదాహరణ మహేష్ బాబు నటించిన దూకుడు సినిమా.
శ్రీను వైట్ల దర్శకత్వంలో వచ్చిన దూకుడు బ్లాక్ బస్టర్ హిట్ అవగా ఆ తర్వాత వచ్చిన ఆగడు మాత్రం భారీ డిజాస్టర్ గా మిగిలింది. ఇలా బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు కోలీవుడ్ లోను వచ్చిన సీక్వెల్స్ బ్లాక్ బస్టర్స్ గా నిలవడమే కాదు బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్స్ గాను మిగిలాయి. అయితే దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ఫ్రాంఛైజీ మాత్రం 1850 కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టి తెలుగు సినిమా సత్త ఏంటో చూపించింది.